మేడ్చల్/చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 9 : రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన దోపిడీ దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన స్వప్రయోజనాల కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు. ఆదివారం మండలంలోని ఆరెగూడెం, గుండ్లబావి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో సుమారు 150 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 18 ఏండ్లుగా రాజగోపాల్‌రెడ్డి దోపిడీ చేస్తూ కోట్లు సంపాదించాడని ధ్వజమెత్తారు. మళ్లీ మోదీ, అమిత్‌షాలతో కలిసి ప్రజలను మోసం చేసేందుకు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలన ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలిపారు. బీజేపీ పాచిపోయిందని, కాంగ్రెస్‌కు దిక్కుదివానా లేదని ఆయన విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సర్పంచ్ మునగాల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నిరంజన్‌గౌడ్, పీర్జాదిగూడ మేయర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.