సిటీబ్యూరో, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వనరులు పునర్జీవనాన్ని పొందుతున్నాయి. సహజసిద్దంగా ఉన్న నీటి వనరులకు కించిత్తు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి – సుందీరకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు దాదాపు 510.5 కోట్లతో వివిధ పనులు చేపడుతున్నది. 19 చెరువులను పునరుద్ధరణ పనులు చేపడుతుండగా, 63 చోట్ల చెరువులను అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. మిగిలిన చోట్ల స్వచ్ఛ లేక్లుగా మార్చుతున్నారు. చెరువుల సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఎంట్రన్స్ ప్లాజా, లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులను ఆకర్షించేలా, పరిసర ప్రాంతాలలో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూల మొక్కలు, వాకర్స్, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర పనులు చేపడుతున్నారు. కాగా సీఎస్ఆర్ కింద 14 చెరువులను పలు కంపెనీలు దత్తత తీసుకోవడం గమనార్హం.
రూ. 282.63 కోట్లతో 19 చెరువుల పునరుద్ధరణ
2020 అక్టోబరు మాసంలో వందేండ్ల తర్వాత కురిసిన భారీ వర్షాలతో చాలా చెరువులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న చెరువులకు వెంటనే మరమ్మతులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని అనేక చెరువుల కట్టలను సరిచేశారు. తూములు, అలుగులు మరమ్మతు చేశారు. మురుగునీటిని చెరువులోకి రాకుండా చేసి శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేస్తున్నారు. సుందరీకరణలో భాగంగా మొకలు నాటి, ప్రమాదాల హెచ్చరిక బోర్డులు, బెంచీలు, చెత్త డబ్బాలు, ప్రజా మరుగు దొడ్ల నిర్మాణాలు, తదితర పనులు చేపడుతున్నారు.
చెరువుల అభివృద్ధి/సుందరీకరణకు రూ. 94.17కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలో 63 చెరువులను అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ. 94.17కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎంపిక చేసిన ఈ చెరువుల చుట్టూ ఫెన్సింగ్, సివిల్ వర్క్స్ చేపడుతున్నారు. ఆహ్లాదకరంగా మార్చడంతో పాటు వాకింగ్ ట్రాక్, బండ్ బలోపేతం, ల్యాండ్స్క్రేపింగ్/ఫ్లాంటేషన్, లైటింగ్ ఏర్పాట్లు వంటివి చేపడుతున్నారు.
రూ.133.7 కోట్లతో స్వచ్ఛ లేక్స్
జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులను స్వచ్ఛ లేక్స్గా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి చుక్క మురుగునీరు వచ్చి చేరకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మురుగునీటి మళ్లింపునకు గానూ రూ. 133.7కోట్లను ఖర్చు చేస్తూ 134 చోట్ల పనులు చేపడుతున్నది.