మునుగోడు, అక్టోబర్ 9: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాల అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని కొరటికల్‌లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారం, ప్రేమతో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమన్నారు. మునుగోడు ఉప ఎన్నికను యావత్ దేశం చూస్తుందన్నారు. రూ.22వేల కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మూడేండ్లు పదవిలో ఉండి ఏ ఒక్క పని చేయని కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన ఆయన ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరించిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి ఓట్లు వేయించాలని సూచించారు. కొరటికల్ ఎంపీటీసీ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించి పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కూసుకుంట్ల గెలుపును అడ్డుకోలేరు :ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కొయ్యలగూడెం, ధర్మోజిగూడెం, ఎల్లంబావి గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్)తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, ఈ విషయంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి పార్టీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా సమష్టిగా కృషి చేయాలని బూత్ ఇన్చార్జిలు, పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.