రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని
క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం పిల్లల వార్డు ప్రారంభం..
జీవితంలో కరుణ, సంరక్షణ,ఆప్యాయత ఎంతో అవసరం
చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేసిన హీరో రానా
శేరిలింగంపల్లి, అక్టోబర్ 8: “ప్రతి మనిషికి అమ్మలాంటి సేవలు జీవితం చివరి క్షణాల్లో ఎంతో అవసరం. కరుణ, సంరక్షణ, ఆప్యాయత జీవితంలో విలువైనవి. వాటిని అవసరమైనప్పుడు పొందితే జీవితంలో మధురానుభూతులుగా మిగిలిపోతాయి” అని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని అన్నారు. శనివారం ఖాజగూడలోని స్పర్శ్ హాస్పైస్ కేంద్రంలో క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన పిల్లల వార్డు ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మ స్పర్శతో మనిషి జీవితం ప్రారంభమవుతుంది. అలాంటి సేవలు అందించే దిశగా స్పర్శ్ కేంద్రం అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. బాధితులను చివరి క్షణాల్లో అక్కున చేర్చుకుంటూ అందిస్తున్న స్పర్శ్ సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. నిస్సహాయ పరిస్థితుల్లో బాధితులకు విశేష సేవలు అందించేందుకు స్పర్శ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం 10 పడకల వార్డును ప్రారంభించుకోవడం మంచి పరిణామం అన్నారు. స్పర్శ్ కేంద్రానికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లపుడు సిద్ధంగా ఉంటామన్నారు. చాలా మంది దేవాలయంగా భావించే స్పర్శ్ కేంద్రాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు దగ్గుపాటి రానా అన్నారు. అనంతరం చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటుచేసిన 10 పడకల వార్డును ఆయన ప్రారంభించారు. అక్కడ సేవలు పొందుతున్న చిన్నారులతో మాట్లాడారు. సెల్ఫీలు దిగి సరదాగా గడిపారు. ఈ కేంద్రానికి తన వంత సహాయ సహాకారాలు ఎల్లపుడు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రెయిన్బో హాస్పిటల్ గ్రూప్ అధినేత రమేష్ కంచర,్ల బంజారాహిల్స్ రోటరీక్లబ్ అధ్యక్షుడు ప్రభాకర్ దూళిపూడి తదితరులు పాల్గొన్నారు.