మేడ్చల్ రూరల్, అక్టోబర్ 8 : విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి సృష్టించే స్థాయికి ఎదగాలని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సేయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం 12వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్వీ రమణారావు మాట్లాడుతూ… విద్యార్థులు వృత్తిలో రాణించాలంటే నిబద్ధత అవసరమని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చన్నారు. ఉన్నత విద్యాభ్యాసంతో పాటు సృజనాత్మక ఆలోచనలతో ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగాలని సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన అచల సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజేశ్ రాజు మాట్లాడుతూ… సమయం, క్రమశిక్షణ, కష్టపడేతత్వంతో విద్యార్థులు జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి టీవీ రెడ్డి, కళాశాల చైర్మన్ బాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత, డైరెక్టర్లు సరోజరెడ్డి, అనురాగ్ రెడ్డి, సభ్యురాలు శ్రీదేవి, పీఆర్వో రవి సుధాకర్, ఏవో ప్రభాకర్ రెడ్డి, హెచ్వోడీలు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.