సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ/చార్మినార్, అక్టోబర్ 8 : మిలాద్ ఉల్ నబీ సందర్భంగా మత పెద్దలు నిర్వహించే ర్యాలీ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. శనివారం పాతనగరంలోని పురాణిహవేలీ డీసీపీ కార్యాలయంలో మత పెద్దలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. శాంతి ర్యాలీలో పాల్గొనే వారికి మతపెద్దలు తగిన సూచనలు, సలహాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. ఖాద్రీ చమన్ నుంచి అలియాబాద్, శాలిబండ, చార్మినార్, మదీనా క్రాస్ రోడ్డు, సాలార్జంగ్ మ్యూజియం, దారుల్షిఫా, మొఘల్‌పుర వరకు సాగే ర్యాలీలో డీజేలు వినియోగించవద్దని సూచించారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక నజర్
ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ఏవైన పోస్ట్లుగాని, మెసేజ్‌లు గాని, ఇతర ఏవిధమైన దుర్వినియోగం జరిగినా బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ ఊరేగింపునకు రాష్ట్ర ప్రభుత్వం, నగర పోలీసులు అందిస్తున్న సహకారాన్ని, ఏర్పాట్లను ఊరేగింపు సంఘం సభ్యులు అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ విక్రంసింగ్‌మాన్, జాయింట్ సీపీలు కార్తికేయ, విశ్వప్రసాద్, డీసీపీ సాయిచైతన్య, టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. నగరంలోని పలు ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
ఊరేగింపు వెళ్లే మార్గాలు
మిలాద్ ఉన్ నబీ ప్రధాన ఊరేగింపు పాతబస్తీలోని ఖాద్రీ చమన్ నుంచి ప్రారంభమై, గులామ్ ముర్తుజా కాలనీ, ఫలక్‌నుమా, అలియాబాద్, లాల్‌దర్వాజా ఎక్స్రోడ్లల మీదుగా చార్మినార్, గుల్జార్‌హౌస్, మదీనా, నయాపూల్ బ్రిడ్జి నుంచి కుడివైపునకు మళ్లి, సాలార్జంగ్ మ్యూజియం, సాలార్జంగ్ రోటరీ, పురాణి హవేలి, ఇతేబార్ చౌక్ మీదుగా వచ్చిన ఊరేగింపు బీబీ బజార్‌లోని వోల్టా హోటల్ వద్ద ముగుస్తుంది.
ఊరేగింపు ప్రారంభమైన సమయంలో శంషీర్‌గంజ్, ఇంజిన్‌బౌలి వైపునకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. అటు వైపు వెళ్లే వాహనాలను ఎంబీఎన్ఆర్ ఎక్స్‌రోడ్ వద్ద దారి మళ్లించి కందికల్ గేట్, పిసల్‌బండ, ఓల్డ్ కర్నూల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
ఇంజిన్‌బౌలి వద్ద ప్రధాన ఊరేగింపు ముగిసిన వెంటనే ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ను అనుమతిస్తూ, యధావిధిగా ఇంజిన్‌బౌలి, గోశాల, ఖాద్రీ చమన్ మీదుగా వాహనాల రాకపోకలను అనుమతిస్తారు. అయితే అక్కడి నుంచి నాగుల చింత, చార్మినార్ వైపు మాత్రం అనుమతించరు. ప్రధాన ఊరేగింపు ప్రారంభమైన సమయంలో బహుదూర్‌పురా నుంచి కాలాపత్తర్ వైపు వచ్చే వాహనాలను కాలాపత్తర్ వై-జంక్షన్ వద్ద దారి మళ్లించి అలీనగర్ జహనుమా మీదుగా అనుమతిస్తారు.
ప్రధాన ఊరేగింపు నాగులచింత జంక్షన్ వద్దకు చేరుకున్న సమయంలో అటు వైపు వచ్చే ట్రాఫిక్‌ను హరీబౌలి, అశోక పిల్లర్ వయా సుధా లైబ్రరీ మీదుగా దారి మళ్లిస్తారు. ఊరేగింపు హిమత్పురాకు చేరుకున్న సమయంలో పంచమొహల్లా వైపునకు ట్రాఫిక్‌ను అనుమతించరు. షా ఫంక్షన్ హాల్ నుంచి కిల్వత్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. ఊరేగింపు చార్మినార్ వద్ద ముగిసే సమయంలో ఆ వైపు వచ్చే వాహనాలను రాజేశ్ మెడికల్ హాల్, ఖిల్వత్, అక్కన్న-మాదన్న టెంపుల్, మొఘల్‌పురా మీదుగా దారి మళ్లిస్తారు.
మక్కామసీదు మీదుగా ఊరేగింపు వెళ్లే సమయంలో కాలీకమాన్ నుంచి గుల్జార్‌హౌస్ వైపు వచ్చే వాహనాలను అర్మాన్ హోటల్, ఇతెబార్ చౌక్ మీదుగా దారి మళ్లిస్తారు.
ఊరేగింపు చార్‌కమాన్ వద్దకు చేరుకున్న సమయంలో మదీన నుంచి చార్మినార్ వైపు వెళ్లే వాహనాలను మదీన వద్ద దారి మళ్లించి సిటీకాలేజీ మీదుగా అనుమతిస్తారు.
బీబీ బజార్‌కు ఊరేగింపు చేరుకోగానే తలాబ్‌కట్ట నుంచి వచ్చే వాహనాలను వోల్టా హోటల్ వైపు అనుమతించరు. ఊరేగింపు ముగిసే వరకు అటు వైపు వచ్చే వాహనాలను మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ మీదుగా దారి మళ్లిస్తారు.
ఫ్లెఓవర్ల మూసివేత
బేగంపేట, లంగర్‌హౌస్, డబీర్‌పురా, లాలాపేట, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా నగరంలోని ఇతర అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.