తార్నాక నుంచి బంజారాహిల్స్‌కు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి రైడ్ ధర 200 చూపించింది. ఆన్లైన్ పేమెంట్‌కు ఓకే చేసుకున్నాడు.. 5 నిమిషాలు గడిచినా.. డ్రైవర్ రాలేదు. అతడికి ఫోన్ చేస్తే.. ధర గిట్టుబాటు కాదని.. రూ. 350 ఇస్తేనే వస్తానని.. లేదంటే రద్దు చేసుకోమని తెగేసి చెప్పాడు. ఇది ఆ ఒక్క వ్యక్తికే ఎదురైన అనుభవం కాదు.. అనేక మందికి ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరవాసులకు క్యాబ్ ఆధారిత సేవలు చుక్కలు చూపిస్తున్నాయి. రైడ్‌లో చూపించిన ధరకంటే.. డ్రైవర్లు రెండింతలు వసూలు చేస్తున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇస్తున్నారు. యాప్‌లలో సూచించిన ధరలను డ్రైవర్లు అమలు చేయడం లేదని.. ఇష్టం వచ్చినట్లు చార్జీలు బాదేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సదరు సంస్థలకు ఫిర్యాదులు చేసినా.. స్పందన ఉండటం లేదని వాపోతున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఓలా, ఉబర్, ర్యాపిడో ఇతర వాహన ఆధారిత సంస్థలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రైడ్‌లో చూపించిన ధర ఒకలా ఉంటే.. డ్రైవర్లు అడిగేది దానికి డబుల్ ఉంటుంది. ఇదేమిటని సదరు సంస్థలకు ప్రయాణికులు ఆన్లైన్లో ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. ఇలా నగరంలో చాలా మందికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. కాల్ చేసి ఫేర్ ధరలు తెలుసుకొని గిట్టుబాటు కాకపోతే బుకింగ్స్ రద్దు చేస్తున్నారు. మరికొందరు డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రయాణికులకు నిర్ణీత నిబంధనల మేరకు చార్జీలు ప్రకటించి పరోక్షంగా కంపెనీలకు తెలియకుండా డ్రైవర్లు దందా చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో 60వేల వరకు ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ ఆధారిత వాహనాలు సేవలు అందిస్తున్నాయి.
రాకపోకలు అధికం..
నగరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, పర్యాటక, ఐటీ కంపెనీల ప్రాంతాలకు క్యాబ్ సర్వీసులు విరివిగా ఉంటాయి. మనం ఇంట్లో ఉండి రైడ్ బుకింగ్ చేసుకుంటే ఇంటికి వాహనం వస్తుంది. అనుకున్న లొకేషన్లో డ్రాప్ చేస్తారు. దీంతో చాలా మంది క్యాబ్ సంస్థల సేవలను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ డ్రైవర్ల తీరు మరోలా ఉంది. వర్షంలో ఫేర్ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కాగా సంస్థలు ప్రతీ రైడ్పైన 30 శాతం కమీషన్ తీసుకొని 70 శాతం డ్రైవర్ల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. ఆ డబ్బులు రావడానికి వారం రోజులు పడుతుంది. ఈ లోపున వాహనాల మెయింటెనెన్స్, పెట్రోల్, ఇతర ఖర్చులు ఎలా అని క్యాబ్ సంస్థల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే తక్కువగా ఉన్న రైడ్స్‌ను రద్దు చేసుకుంటున్నామని డ్రైవర్లు తమ వాదనను వినిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రవాణాశాఖ అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో సదరు సంస్థలపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని రవాణా అధికారులు ప్రకటించినా ఫలితం ఉండటం లేదు.
ఆటోలు కీలకం..
నగరంలో ప్రయాణాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆఫీసులు, ఇతరత్రా ప్రయాణాలకు అధికంగా ఆటోలను ఎంచుకుంటారు. నగరంలో ఆటో చార్జీలు మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.20 ఉంటుంది. ఆ తర్వాత కిలో మీటర్‌కు రూ.11 ఉంటుంది. అంతేకాదు వంద కిలోల లగేజీకి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది రవాణాశాఖ నిర్ణయించిన ధరలు. ఈలెక్కన సికింద్రాబాద్ నుంచి నీలాద్రినగర్కు 20 కిలో మీటర్లు అవుతుంది. నిబంధనల ప్రకారం 230 రూపాయల లోపునే చార్జీ ఉండాలి. కానీ వాళ్లు ఈ ధరను కూడా విస్మరించి 500 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారని సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు తమ యాప్‌లలో సూచించిన ధరలను సదరు డ్రైవర్లు అమలు చేయడం లేదని వాపోయాడు. ఇష్టమొచ్చినట్టు చార్జీలు వేస్తూ.. ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ట్యాక్సీ వాహనాల కారణంగా మిగతా ఆటోలను నడిపేవారు కూడా తమ ధరలను పెంచేస్తున్నారు. అడ్డూఅదుపులేకుండా సాగుతున్న వీరి ఆగడాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వాహన సంఘాల నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు రెట్టింపు వసూలు చేస్తున్నారు
నేను ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు క్యాబ్ బుక్ చేసుకున్నాను. ధర రూ.110 చూపించింది. 10 నిమిషాలు గడిచినా డ్రైవర్ రాకపోవడంతో నేను ఫోన్ చేశాను. అతడు డబ్బులు ఎంత చూపించింది అని అడిగాడు. నేను చెప్పాను. దాంతో అది మాకు సరిపోవడం లేదని 200 ఇస్తే క్యాబ్ వస్తుందని చెప్పాడు. అదేంటని అడిగితే మీ ఇష్టం రద్దు చేసుకోవచ్చు అంటూ రూడ్‌గా మాట్లాడాడు. నేను ఆ రైడ్ రద్దు చేసి మరలా ప్రయత్నిస్తే అరగంట అయినా రైడ్ బుకింగ్ కాలేదు. అనంతరం రైడ్ ఓకే అయ్యాక అదే పరిస్థితి ఎదురైంది. చేసేదేమీ లేక వారు అడిగినంత ఇచ్చేసి వెళ్లాను.
– మానస, ఐటీ ఉద్యోగి.
ఆన్లైన్ పేమెంట్స్ వద్దు
క్యాష్ ఉంటేనే బుకింగ్ ఓకే చేస్తున్నారు. లేదంటే రైడ్ రద్దు చేసుకోమంటున్నారు. నాకు ర్యాపిడో వాలెట్లో రూ.500లకు పైగా బ్యాలెన్స్ ఉంది. అందులో ఒక్క రైడ్‌కు కూడావాటిని వినియోగించుకోలేదు. ఇప్పటికీ పది సార్లు ర్యాపిడో బుక్ చేశాను. అందులో పదిసార్లు ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేశాను. కానీ వారు కాల్ చేసి విషయం తెలుసుకొని రైడ్ రద్దు చేశారు. చేసేదేమిలేక క్యాష్ పేమెంట్ చేయాల్సివస్తుంది. ఈ విషయంపై సదరు సంస్థకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. డ్రైవర్ల తీరు మారడం లేదు.
-ప్రకాశ్, ఉద్యోగి