సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : జలదృశ్యంలో పడిన తొలి అడుగుల నుంచి చరిత్ర గతిని మార్చిన అద్భుత ప్రస్థానం టీఆర్ఎస్ది. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించి.. తెలంగాణ సాధించడంలో అనిర్వచనీయమైన భూమిక పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. జాతీయ పార్టీగా అవతరించింది. విజయదశమి రోజు.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించిన వెంటనే గ్రేటర్‌వ్యాప్తంగా గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ‘దేశ్‌కీ నేత కేసీఆర్’.. ‘జయహో బీఆర్ఎస్’.. అన్న నినాదాలు మిన్నంటాయి.
అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలంగాణ భవన్ వేదికైంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. జాతీయ పార్టీగా మార్చుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యమాలిక మీకోసం.
స్వరాష్ట్ర సాధనే లక్ష్యం. ఆత్మగౌరవమే నినాదం. ఎత్తిన జెండా దించలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. రాష్ట్రం మొత్తాన్ని ఒక్కటి చేశారు. స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తారు. భావజాలాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఢిల్లీ దిగొచ్చేలా ఉద్యమించారు. తెలంగాణ వాసుల ఏండ్ల కలను సాకారం చేశారు నాటి ఉద్యమ నేత, ప్రస్తుతం సీఎం కేసీఆర్. 8 ఏండ్లలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పాలన అందించి 28 రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచారు.
తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో రోల్ మోడల్‌గా నిలుపడమే కాకుండా ఆ ప్రగతి ఫలాలు దేశమంతటా అందివ్వాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలకు నాంది పలికారు. ఒకప్పుడు జలదృశ్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ను ప్రస్తుతం బీఆర్ఎస్గా మార్పు చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, 8 సంవత్సరాల ప్రగతిలో సబ్బండ వర్గాలు.. సకల జనులు.. అనేకానేక సంఘాలు.. ఎన్నో ఉద్యమ రూపాలు, మరెన్నో చారిత్రాత్మకమైన మైలురాళ్లు.. అన్నింటా గులాబీ జెండా ప్రస్థానం అసామాన్యం.. జలదృశ్యం నుంచి భారత్ రాష్ట్ర సమితిగా మారడంలో ఎన్నెన్నో మలుపులు..
గ్రేటర్లో టీఆర్ఎస్ ముఖ్య ఘట్టాలు