సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ):దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజ్వలింపజేయాలని టీఆర్ఎస్ సంకల్పించింది. 2003 మార్చి 27న ఫలక్‌నుమా నుంచి రోడ్డు మార్గంలో 10 జిల్లాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి 1000 కార్లతో ర్యాలీగా వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న ఉద్యమ నేత కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు రాంవిలాస్ పాశ్వాన్ ఆహ్వానం పలికారు.
మార్పునకు శ్రీకారం..
టీఆర్ఎస్ ఆవిర్భవించిన రోజు తెలంగాణ ఏర్పడుతుందనే నమ్మకం ఎవరికీ లేదు. కాల గమనంలో టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించింది. ముఖ్యంగా రాష్ట్ర ఏర్పాటు కోసం పురుడుపోసుకున్న పార్టీ స్వరాష్ర్టాన్ని సాధించడమే కాకుండా ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి రావడమనేది జాతీయ రాజకీయాల్లోనే అరుదైన పరిణామం. అంతేకాక కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ర్టాన్ని అనతి కాలంలోనే దేశానికే మోడల్‌గా నిలపడమనేది టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కే సాధ్యమైంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, జోడెద్దు బండిలా ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది.
ప్రధానంగా ఒకనాడు పడావు భూముల కేంద్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిన తీరు దేశవ్యాప్తంగా రైతుల్ని ఆకర్షిస్తున్నది. తెలంగాణ పథకాలు కావాలంటూ అనేక రాష్ర్టాల్లోని అన్నివర్గాల ప్రజలు నినదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మరోవైపు ఇదే ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు.. వెరసి గులాబీ జెండా తెలంగాణకే కాదు.. యావత్తు దేశానికి అవసరమనే ఆవశ్యకతను భారతావని గుర్తించింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వివిధ పార్టీల నేతలు సహా జాతీయ రైతు సంఘం నాయకులు, మేధావులు అనేక మంది వెంట రాగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపుదిద్దుకున్నది. హైదరాబాద్ మహా నగర చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
జాగరణ సేన
యూపీఏ నుంచి వైదొలిగిన అనంతరం తెలంగాణ భావజాల వ్యాప్తికి లక్ష మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ జాగరణ సేన పేరిట మొదటి దశలో అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 605 మందికి పైగా కార్యకర్తలకు 10 సెప్టెంబర్ 2005న నాచారంలోని సోమా ఫంక్షన్ హాల్లో శిక్షణ ప్రారంభించారు. వీరికి ప్రేరక్‌లుగా పేరు పెట్టి యూనిఫామ్స్, కర్రలను అందించారు.
పరేడ్‌గ్రౌండ్‌లో ..
తెలంగాణ ఏర్పాటు విషయమై కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు యూపీఏ మిత్రపక్షాలతో కలిసి 1 డిసెంబర్ 2004లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు అజిత్‌సింగ్, రాందాస్, డాక్టర్ కృష్ణన్ లాంటి జాతీయ నేతలు హాజరయ్యారు. ఫలితంగా 5 జనవరి 2005న నాటి ప్రభుత్వం ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షతన తెలంగాణ ఏర్పాటు అంశంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. యూపీఏలోని 13 పార్టీల్లో 11 పార్టీల మద్దతును టీఆర్ఎస్ కూడగట్టింది.
హైదరాబాదే వేదిక..
తెలంగాణను సాధించిన పార్టీగానే కాకుండా.. ఎనిమిదేండ్ల పాటు రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన టీఆర్ఎస్కు మూలకేంద్రమైన తెలంగాణభవన్‌లో తిరిగి అదే గులాబీ జెండాను ఎగురవేశారు. ఈ సారి 5 అక్టోబర్ 2022న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు, భారత దేశ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఏర్పాటు చేశారు. అయితే నాడు పిడికెడు మంది ఉంటే.. నేడు భారతావని వెంట నిలిచింది. మేధావులు, విద్యావంతులు, రైతులు, శ్రామికులు.. ఇలా ఒకరేమిటి! అనేక రాష్ర్టాల నుంచి మేమున్నాం.. అంటూ కేసీఆర్ వెన్నంటి నిలుస్తున్నారు.
ఉద్యమంలో కీలక ఘట్టాలు..