ప్రకృతి పూల పండుగ బతుకమ్మ నగరంలో అత్యంత ఉత్సాహంగా సాగుతున్నది. ఆరో రోజైన శుక్రవారం నాడు వేడుకగా సాగింది. ఈ నేపథ్యంలోనే పీపుల్స్‌ప్లాజాలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మలో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్లు
బడంగ్‌పేట, సెప్టెంబర్ 30 : బతుకమ్మకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకే దక్కుతుందన్నారు మంత్రి సబితాఇంద్రారెడ్డి. మీర్‌పేట పరిధిలోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఎక్కడ ఉంటే కవితమ్మ అక్కడ ఉండేదన్నారు. బతుకమ్మ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు.
బతుకమ్మలో ఉన్న పువ్వులను దేవునిగా కొలిచే గొప్ప సంస్కృతి మన రాష్ట్రంలో మాత్రమే ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బాలగంగాధర్ తిలక్‌ను ఆదర్శంగా తీసుకొని పండుగల ద్వారా ఉద్యమాన్ని నిర్వహించామని చెప్పారు. వినాయకుడిని ముందు పెట్టి బ్రిటిష్ వారితో తిలక్ అనేక పోరాటాలు చేశారన్నారు. అలాంటి నేపథ్యం నుంచి తెలంగాణలో బతుకమ్మను ముందు పెట్టుకొని ఉద్యమాన్ని నిర్వహించామన్నారు. ఎన్నో కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు ఆటలు, పాటలు నేర్పించి వారిని ఉద్యమం వైపు నడిపించామని తెలిపారు. గతంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు వేదికలు దొరికేవి కాదని.. ఈ కళాశాలలో సంబురాలకు ఇంతమంది వచ్చారంటే ఇక బతుకమ్మకు ఢోకా లేదని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి కవిత బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, టీకేఆర్ కళాశాల కార్యదర్శి తీగల హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్నాథ్ రెడ్డి, తీగల అరుంధతి కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, మహిళా సంఘాలు, విద్యార్థులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఆటపాటలతో సాగర తీరం పులకరించింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేతృత్వంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, గ్రేటర్ పరిధిలోని 50 మంది మహిళా కార్పొరేటర్లు బతుకమ్మ ఆడి సందడి చేశారు.
– ఖైరతాబాద్, సెప్టెంబర్ 30
శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం వద్ద ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ
వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. అమ్మపల్లి సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
చేసిన అనంతనం.. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి… కోనేరులో నిమజ్జనం చేశారు.
– శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 30
మలక్‌పేట వికలాంగుల సంక్షేమ భవన్లో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి, ఎండీ శైలజ, జీఎం ప్రభంజన్‌రావు, ఏడీ రాజేందర్,మోతి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేదిక్ దవాఖానలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ పరమేశ్వర్ నాయక్, బి.స్వరూపారాణి,డాక్టర్ రాంచందర్, డాక్టర్ యశోద, జ్యోతి, సబిత, పూనం తదితరులు పాల్గొన్నారు.