సిటీబ్యూరో/చార్మినార్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : బహదూర్‌పురలో జరిగిన రౌడీషీటర్ హత్యా కేసు మిస్టరీ వీడింది. ఆస్తి, కుటుంబ తగాదాల వల్లే ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్దనుంచి కత్తులు, దేశీ తపంచాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒకరు చాలా కాలంగా మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్. శివసేన నాయకుడిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను సోమవారం బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌లో రౌడీషీటర్ బాబూఖాన్ను ప్రత్యర్థులు దారుణంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.
మృతి చెందిన బాబూఖాన్ మేన కోడలు జరీనా బేగంను చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ జాబేర్ అలియాస్ జాబేర్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జాబేర్ ఈనెల 13న రెండో భార్య అయిన జరీనా బేగంకు ఫంక్షన్ చేసి దుర్భాషలాడాడు. మనోవేదనకు గురైన జరీనా బేగం.. “నన్ను వేధిస్తున్నావని మా మామకు చెబుతాను.. ఆయన 24 గంటల్లో నీ పని పడుతాడు..” అంటూ హెచ్చరించింది. అప్పటికే బాబూఖాన్‌కు, మహ్మద్ జాబేర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. బాబూఖాన్తో ఎప్పటికైనా ప్రమాదమని భావించిన జాబేర్.. అతడిని అడ్డుతొలగించేందుకు ప్లాన్ వేశాడు.
14వ తేదీన బాబూఖాన్ హసన్‌నగర్‌లోని సలీం హోటల్ వద్ద ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన జాబేర్ తన స్నేహితులైన రాహుల్ రాజ్ తడాస్ అలియాస్ రాఖీ, మహ్మద్ ఒమర్, మహ్మద్ ఉస్మాన్, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఖదీర్‌తో కలిసి బాబూఖాన్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. బాబూఖాన్ కుప్పకూలిపోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాబూఖాన్ భార్య మెహరాజ్‌బేగం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. విశ్వసనీయ సమాచారంతో హసన్‌నగర్‌లో ఉన్న నిందితులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, రెండు దేశీ తపంచాలు, 6 రౌండ్ల బుల్లెట్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద తపంచాలు, బుల్లెట్లు లభించడంతో ఆరా తీశారు. నిందితుల్లో ఒకరు మహారాష్ట్రలో శివసేన నాయకుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడని తేలింది.
శివసేన నేత హత్యకు సుపారీ..
బాబూఖాన్ హత్య కేసులో పట్టుబడ్డ రాహుల్ రాజ్ మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్ నేరగాడు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా శివసేన అధ్యక్షుడు యోగేశ్ ఘరట్ను గత ఏప్రిల్ నెలలో హత్య చేసేందుకు ఏడుగురితో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. తుపాకులతో అతడిపై ఈ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఇందులో యోగేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొంది కోలుకున్నాడు. రాహుల్‌రాజ్ అప్పటికే దోపిడీ, పోక్సో.. వంటి ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులతో పాటు మరొకటి హత్యాయత్నం కేసు నమోదు కావడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మహారాష్ట్ర వదిలి తన వద్ద ఉన్న తుపాకులు, బుల్లెట్లతో హైదరాబాద్‌కు వచ్చాడు. పహాడీషరీఫ్ ప్రాంతంలో మహ్మద్ జాబేర్‌ను కలుసుకున్నాడు. ఇద్దరు స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి జాబేర్ గ్యాంగ్‌లో పనిచేస్తున్నాడు. శివసేన నేత హత్యాయత్నం కేసులో సుపారీ గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు రాహుల్ రాజ్ చిక్కలేదు. రాహుల్ రాజ్ పట్టుబడిన విషయాన్ని బహదూర్‌పుర పోలీసులు అమరావతి జిల్లాలోని వారెద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విలేకరుల సమావేశంలో చార్మినార్ ఏసీపీ భిక్షంరెడ్డి, బహదూర్‌పుర ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సైలు రాజు, నర్సింహా రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.