సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పాతబస్తీలో దొంగతనానికి గురైన కశ్మీర్‌కు చెందిన అరుదైన జాతి సోన్జా బ్రీడ్ మేక కేసును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. శాలిబండ అలీనగర్‌కు చెందిన షేక్ ఒమర్ బవజీర్ కారు డ్రైవర్. అతడికి అరుదైన జంతువులు, పక్షులను పెంచుకోవడం అలవాటు. కొన్నేళ్లుగా బవజీర్ కశ్మీర్‌కు చెందిన అరుదైన జాతి సోన్జా బ్రీడ్ మేకలను పెంచుతున్నాడు. ఒక్కో మేక ఖరీదు మార్కెట్లో దాదాపు రూ. రెండు లక్షల వరకు ఉంటుంది. బవజీర్ తన మేకలను ఇంటి వద్ద స్వేచ్ఛగా వదిలేస్తాడు. తన గేట్ లోపలే ఉంటాయి. శాలిబండకు చెందిన అర్మాన్ నయీమ్ తరచూ బవజీర్ ఇంటి ముందు నుంచి రాకపోకలు సాగిస్తుంటాడు. ఇంటి ఆవరణలో తిరుగుతున్న మేకలు, పక్షులను గమనించాడు. అర్మాన్ నయీమ్ గతంలో వాహనాలు, ప్రార్థనా స్థలాల్లో చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై నాలుగు కేసులున్నాయి. సోన్జా బ్రీడ్ మేకలపై నయీమ్ కన్ను పడింది.
దీంతో ఒక మేకను అపహరించాలని ప్లాన్ వేశాడు. తన స్నేహితుడితో కలిసి ఈనెల 15న బవజీర్ ఇంటి వద్దకు బైక్‌పై వచ్చాడు. స్నేహితుడు బైక్‌పై కూర్చొని ఉండగా, నయీమ్ ఆ ఇంట్లోకి దూకి, మేకను అపహరించుకొని వెళ్లాడు. బవజీర్ శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాలను విశ్లేషించారు. మేకను దొంగిలించింది నయీమ్‌గా గుర్తించి పట్టుకున్నారు. ఆ మేకను శంషాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్ యజమానికి రూ.50 వేలకు విక్రయించినట్లు నిందితుడు చెప్పాడు. మేకను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్‌కు చెందిన ఈ మేకను నగర వాసులు ఇష్టపడుతారని, అందువల్లే ధర ఎక్కువ అని శాలిబండ ఇన్స్పెక్టర్ కిషన్ చెప్పారు.