సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : వరద నీటి ముంపు ముప్పు నుంచి గ్రేటర్ ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పనులు సాగుతున్నాయి. 2020లో కురిసిన కుండపోత వర్షాలు, అందునా గంటలో 20 సెంటీమీటర్ల వర్షపాతంతో గ్రేటర్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఇండ్లు, కాలనీలలో వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల వాసులు బతుకుజీవుడా అంటూ జీవనం సాగించారు. దాదాపు 40 వేల కుటుంబాలు అల్లాడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్‌లోనూ కుండపోత వర్షాలు కురిసినా ప్రజలకు వరద నీటి ప్రభావం లేకుండా ఉండేందుకుగానూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ కేటీ రామారావు సారథ్యంలో వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకానికి (ఎస్ఎన్డీపీ) శ్రీకారం చుట్టారు. ఎస్ఎన్డీపీ ఫేజ్-1 కింద రూ.985.45కోట్లు నిధులను మంజూరు చేసింది. చెరువులు, కుంటలు, తూముల అభివృద్ది తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట్ల కొత్త నిర్మాణాలు, కుచించుకుపోయిన చోట నాలా విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతానికి చర్యలు చేపట్టింది. హైదరాబాద్ ప్రధాన వరదనీటి పొడవు 473 కిలోమీటర్లుగా ఉండగా, ఇందులో ఫేజ్-1లో భాగంగా 78 కిలోమీటర్లను ఎంచుకుని పనులు చేపడుతున్నారు. ఈ తొలి విడత పథకం పూర్తితో 45 శాతం మేర వరద నీటి సాఫీగా వెళ్లి శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇదే విషయాన్ని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ రెండు రోజుల క్రితం జరిగిన సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. గడిచిన మూడు నెలలుగా వర్షాల కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని, ప్రస్తుతం 51 చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ 70శాతం మేర పూర్తి చేసుకున్నాయని జియావుద్దీన్ తెలిపారు. రాబోయే రెండు నెలల్లోగా తొలి విడత పథకం పనులను పూర్తి చేస్తామని జియావుద్దీన్ స్పష్టం చేశారు.
ఎల్బీనగర్, సెప్టెంబర్ 21 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా డెవలప్మెంట్ కార్యక్రమం కింద రూ. 103.25 కోట్లతో పనులు చేపడుతున్నారు. 2020లో కురిసిన వర్షాలతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు నష్టం ఎక్కువ కావడంతో ఎస్ఎన్డీపీ పనులలో తొలివిడతలోనే ప్రాధాన్యత కల్పించారు. ప్రధానంగా బండ్లగూడ చెరువు నుంచి మూసీ వరకు రెండు ప్యాకేజీల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి కావడంతో ఈ ఏడాది వరద ముంపు ప్రభావం కనిపించ లేదు. ఈ పనులు పూర్తయితే ముంపు సమస్య నుంచి చాలా వరకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.
బేగంపేట్ సెప్టెంబర్ 21 : బేగంపేట్‌లో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా నాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి నుంచి బేగంపేట్ వరకు వచ్చే ప్రధాన నాలా అభివృద్ధికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు రూ.45 కోట్లతో పనులు చేపడుతున్నారు. నాలాకు ఇరువైపులా నూతన పైపులైన్లు, రిటర్నింగ్ వాల్వ్‌లు, ప్రహరీలను నిర్మించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే ప్రధాన రహదారిలో రసూల్‌పుర జంక్షన్ వద్ద నాలాపై వంతెన ఏండ్లక్రితం నాటిది కావడంతో వర్షం కురిసిన ప్రతిసారి రపూల్పుర జంక్షన్ వద్ద నాలాపైకి వరదనీరు ముంచెత్తేది. దీంతో ప్రధాన రహదారి జలమయమై ప్యాట్నీ నగర్, అన్నానగర్, రసూల్‌పుర ఏరియాలో మురికినీరు పారి, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్లు మంజూరు చేయించి నాలాపై వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అది ప్రస్తుతం ఒకవైపు పూర్తి అయింది. మరోవైపు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
మాదాపూర్, సెప్టెంబర్ 21: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్‌లో వరద నీరు చేరి అపార్ట్మెంట్ సెల్లార్లు మునిగిపోయేవి. ఈ సమస్య పరిష్కారానికి ఈర్ల చెరువు నుంచి దీప్తిశ్రీ నగర్ వరకు నాలా విస్తరణ పనులను రూ. 15.88 కోట్ల వ్యయంతో చేపట్టారు. 2.4 కిలో మీటర్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. పనులు పూర్తయితే కాలనీవాసులకు ముంపు నుంచి పూర్తిగా ఉపశమనం లభించనున్నట్లు అధికారులు తెలిపారు.
అల్లాపూర్,సెప్టెంబర్21: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రినగర్, జ్యోతినగర్, లక్ష్మీనగర్ తదితర కాలనీలను వరద నీరు ముంచెత్తేది. సున్నం చెరువు దిగువ నుంచి మైసమ్మ చెరువు వరకు భారీ వాన పడిన ప్రతిసారి నాలా పొంగి ప్రహించేది. దీంతో నాలా పరిసర కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యేది. ముంపు సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీరింగ్ అధికారులు నాలా విస్తరణ పనులు చేపట్టారు. జ్యోతినగర్, గాయత్రినగర్‌లో బాక్స్‌టైప్ కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.కోటి 66లక్షల నిధులు మంజూరు చేయగా, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. దీంతో రెండు సంత్సరాలుగా భారీ వర్షాలు కురిసినప్పటికీ వరద నీరు నాలా నుంచి పొంగకుండా సాఫీగా వెళ్లి పోయింది.