తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 21 : దశాబ్దాలుగా తెలుగు భాషా సాహిత్యాల వికాసంతో పాటు అంతరించిపోతున్న జానపద కళారూపాల మూలాలను తెలుగువర్సిటీ వెలికితీసి సమాజానికి అందించడం అభినందనీయమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలుగు సాహిత్యంలో విశేష సేవలందిస్తున్న 22 మంది ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రముఖులకు 2019 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను బుధవారం వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసి, సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ప్రజల అస్తిత్వానికి ప్రతీక కళారూపాలు అని అన్నారు. సాహిత్యం, భాషతో పాటు సంస్కృతి మూలాలను వెలికితీస్తున్న వర్సిటీ కృషిని కొనియాడారు.
తెలంగాణ విశిష్టతను చాటేలా బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని సూచించారు. తెలుగు భాషా మాండలికాలపై ఆయన ప్రసంగించారు. తెలంగాణ సమాచార కమిషనర్ బుద్ధా మురళి మాట్లాడుతూ.. సాహిత్య రంగానికి సేవ చేస్తున్న గ్రామస్థాయిలోని సాహిత్యకారులకు గుర్తింపుగా వర్సిటీ పురస్కారాలు అందించడం ముదవాహమన్నారు. సెల్‌ఫోన్‌కు అంటుకుపోతున్న నేటి తరం విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్లించే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య టి. కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి పాల్గొన్నారు. జానపద కళల శాఖ విభాగాధిపతి డాక్టర్ లింగయ్య పర్యవేక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన డప్పు నృత్యం ఆహుతులను విశేషంగా అలరించింది. గ్రహీతలకు పురస్కారం కింద ఒక్కొక్కరికీ రూ.5,115 నగదు, పురస్కార పత్రంతో సత్కరించారు.