మియాపూర్, సెప్టెంబర్ 21 : రహదారులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు పోగు చేసే చెత్తను ఎప్పటికప్పుడే సేకరించుకునేందుకు చక్రాలున్న చెత్త బుట్టలు ఎంతగానో దోహదపడతాయని విప్ గాంధీ అన్నారు. కార్మికులకు ప్రభుత్వం తగు సౌకర్యాలు కల్పిస్తూనే పరిసరాల పరిశుభ్రతకు పాటుపడుతుందన్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో పని చేసే పారిశుద్ద్య కార్మికులకు బుధవారం జోనల్ కార్యాలయంలో 400 చెత్త బుట్టలను జడ్సీ శంకరయ్య, డీసీ వెంకన్న, కార్పొరేటర్లు హమీద్ పటేల్, గంగాధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాలతో కలిసి విప్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులను శుభ్రం చేయటం, పరిసరాల పరిశుభ్రతను నెలకొల్పటంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివన్నారు. కరోనా సమయంలో ఎంతో ధైర్యంగా విధులు నిర్వర్తించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్కిళ్ల వైద్యాధికారులు డాక్టర్ నగేశ్, డాక్టర్ కార్తీక్, ఎస్ఐ జలంధర్, కనకరాజు, మహేశ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
గత సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హఫీజ్‌పేట్ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు రామ్‌కుమార్ యాదవ్ కుటుంబానికి పార్టీ సీనియర్ నేత వాసిలి చంద్రశేఖ్ఖర్ ప్రసాద్ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని విప్ గాంధీ చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు మియాపూర్ క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో మృతుడి భార్య శ్రీలత, కుమార్తె ధరణీశ్రీ, ధన్వీర్, పార్టీ నేతలు రంగారావు, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, మోహన్, గంగాధర్, గోపాల్, తిరుమలేశ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్ మయూరీనగర్‌లో మహిళా మండలుల సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రేయ వృద్ధాశ్రమం అనాథ పిల్లల ఆశ్రమంలో పల్స్ హార్ట్ ఛారిటబుల్ నిర్వహకులు డాక్టర్ ముఖర్జీ నేతృత్వంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆశ్రమ కార్యదర్శి వహీన్ అఫ్రోజ్, కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ తరపున రూ. 75 వేల విలువైన రిఫ్రిజిరేటర్‌ను అందించారు. అనంతరం విప్ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా వృద్ధులకు వైద్య సేవలను అందిస్తుండటం అభినందనీయమన్నారు. డాక్టర్ ముఖర్జీ సేవలు ఎందరో వైద్యులకు ఆదర్శనీయమన్నారు. ఈకార్యక్రమంలో ట్రస్టు కోఆర్టినేటర్ చందుక్రాంతి, డాక్టర్లు క్రాంతి, సాయితేజ, పృథ్వీ, హరీష్ పార్టీ నేతలు గంగాధర్, రంగారావు, శ్రీనివాస్, చంద్రిక,రోజా, శ్రీనివాస్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్లోని ఫేజ్ 2 జీఎస్ఆర్లో రూ. 53.50 లక్షలతో చేపడుతున్న యూజీడీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్‌తో కలిసి విప్ గాంధీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సౌకర్యమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రహదారులు, డ్రైనేజీ, తాగునీరు , విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ఝాన్సి , ఏఈ సుభాష్,పార్టీ నేతలు రంగారావు, సమ్మారెడ్డి, అనీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఔట్లెట్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. గురువారం ఆయన గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి చిన్న పెద్ద చెరువు ఔట్లెట్ సమస్యను జోనల్ కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్లెట్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్న పెద్ద చెరువు ఔట్లెట్ సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో చెరువు నిండి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా పరిష్కారాన్ని చేపట్టాల్సిందిగా అధికారులకు సూచించారు. చెరువును సుందరీకరించి గోపన్‌పల్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గోపన్‌పల్లిలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎస్ఈ శంకర్ నాయక్, డీఈ శ్రీనివాస్, ఏఈ విశాలాక్షి, ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, ఏఈ నాగరాజు, నాయకులు గణేశ్ ముదిరాజ్, రాజు నాయక్, శ్రీనివాస్ యాదవ్, సురేందర్, నరేశ్, సత్యనారాయణ, సలావుద్దీన్, శ్రీకాంత్, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.