దేశ దశ, దిశను మార్చేందుకు అందరి వాడు దేశ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అభివృద్ధి మాంత్రికుడు, సంక్షేమ ఫలాల సఫలీకృతుడు, అసలైన హిందుత్వ వాది రాక కోసం దేశం ఎదురు చూస్తున్నది. దశాబ్ద కాలం కిందట తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఒక్కడిగా ముందుకు కదిలి, కోట్లాది మందిని ఏకం చేసి, గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించాడు. పసిగుడ్డు లాంటి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు, అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ప్రభుత్వ ఫలాలను అందజేశారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశంలోనే నం.1 స్థానంలో నిలిపి ప్రపంచ దేశాల చూపును తెలంగాణ వైపు మలిపారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూనే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యజ్ఞ, యాగాలను విజయవంతంగా నిర్వహించి అసలైన హిందుత్వ వాదినని నిరూపించారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఆలయాలను పునర్నిర్మించి దైవ భక్తిని చాటారు. ఇంతటి గొప్ప కార్యాలు చేపట్టిన మహనీయుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజానీకం పిలుస్తున్నది. పేదలను కొట్టి, పెద్దలకు పంచుతున్న బీజేపీకి బుద్ధి చెప్పి మోసకారి మోదీని గద్దె దించాలని కోరుతున్నది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దేశ వ్యాప్తం చేయాలని వేడుకుంటున్నది.
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలి
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాల్సిన అవసరం ఉన్నది. దేశానికి స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– ముడుంబై వరదరాజు స్వామి,తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ ఉపాధ్యక్షుడు, చిక్కడపల్లి
దేశ వ్యాప్తంగా కేసీఆర్‌కు మద్దతు పెరుగుతున్నది
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్పేదొకటి.. చేసేది మరో విధంగా ఉంది. ఎంతో చరిత్ర ఉన్న సంస్థలను ప్రైవేటుపరం చేయటమే కాకుండా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి యావత్ భారతదేశానికి దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ పార్టీల సీనియర్లు కేసీఆర్ అలోచనలకు ప్రభావితులయ్యారు.
-హేమకేశవాచారి, బోరబండ, ఎర్రగడ్డ
దేశాన్ని బాగుచేసే సత్తా కేసీఆర్‌కే ఉన్నది
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. రాష్ర్టాన్ని సాధించిన నేతకు దేశాన్ని బాగుచేసే సత్తా ఉంది. కేంద్రంలోని బీజేపీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి సమాన్యులపై మోయలేని భారం వేశారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే సత్తా కేసీఆర్‌కే ఉంది.
– తులసి శ్రీనివాస్, ఆర్కేపురం
బీజేపీతో దేశానికి ముప్పు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడి బీజేపీ నేతలు మతపరమైన అల్లర్లను సృష్టించటానికి కుట్ర పన్నుతున్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న బీజేపీ సర్కారుతో దేశానికి ముప్పు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి.
-కల్వల సత్యనారాయణరావు, బోరబండ, ఎర్రగడ్డ
పరిపాలనలో సర్వోత్తముడు
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడం శుభసూచకం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సమర్థుడు, పరిపాలనలో సర్వోత్తముడు. ఆయన ఆగమనంతో దేశ రాజకీయాలు పావనం అవుతాయి. దేశ ప్రజలు సైతం కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమగ్రన్యాయం చేస్తూ అందరివాడిలా పేరు ప్రఖ్యాతులు పొందిన సీఎం కేసీఆర్ పట్ల దేశ ప్రజలు సానుకూలంగా ఉన్నారు.
– దోర్బల కాశీనాథ్శర్మ, బాలానగర్ మండల అర్చక సంఘం అధ్యక్షుడు
కేసీఆరే దేశానికి సరియైన నేత
సీఎం కేసీఆరే దేశానికి సరియైన నేత. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారు. అన్ని అంశాలపై అవగాహన ఉంది. అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రజలందరికి న్యాయం జరుగుతుంది. బీజేపీ పాలనలో పేద ప్రజలు బతకలేని పరిస్థితి ఉంది. అన్ని ధరలు, పన్నులను పెంచి, రెండు పూటలా తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయపడాలంటే కేసీఆర్‌తోనే అవుతుంది.
– మల్లారం లక్ష్మీనారాయణ గౌడ్, లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ చైర్మన్, చీర్యాల
దక్షిణాదిపై చిన్నచూపు పోతుంది.!
ఏండ్ల నాటి స్వరాష్ట్ర కలను కోట్లాది మంది ప్రజలను ఏకం చేసి రక్తపు బొట్టు చిందకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్. అంతటి పోరాట పటిమ ఉన్న సమర్థుడైన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి రావటం ఎంతో అవసరం. కేసీఆర్ పాలనా నైపుణ్యం కేవలం ఒక్క రాష్ర్టానికే పరిమితం కారాదు. సీఎం కేసీఆర్ రాకతో దక్షిణాదిపై ఉన్న చిన్నచూపు సైతం తగ్గుతుందన్న ఆశాభావం ఉన్నది.
– సత్యవాణి,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, మియాపూర్
కేసీఆర్‌ను మించిన హిందుత్వవాది లేరు..!
కేసీఆర్ అనుసరిస్తున్న హిందుత్వ జీవన విధానం ఎంతో గొప్పది. నిజమైన హిందువుగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టే పరమత సహనం అనేది ఆయన నరనరాన జీర్ణించుకున్నది. నిజమైన హిందువులుగా జీవించే వారు ఇతర మతాల పట్ల వ్యతిరేకత ప్రదర్శించరు. అటువంటి కోవకు చెందిన వారే కేసీఆర్. యాదగిరిగుట్ట దేవాలయ పునరుద్ధరణ, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన, జరుగుతున్న యజ్ఞ, యాగాలు ఎంతటి మహత్తరమైనవో ప్రజలు తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కంటే గొప్ప హిందుత్వ వాది మరొకరు ఉండరు. హిందుత్వం దేశ వ్యాప్తంగా బాసిల్లాలంటే కేసీఆర్ వంటి నాయకులు జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
-డ్యాగ బాలరాజుయాదవ్,ఎస్ఆర్నగర్, కవి, భగవద్గీత ప్రవచనకారుడు