సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల వేగాన్ని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ట్రాఫిక్ విభాగం అధికారులకు పలు సూచనలు చేశారు. టీఎస్ పీఐసీసీసీలో మంగళవారం ట్రాఫిక్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ. రంగనాథ్‌తో పాటు ట్రాఫిక్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సంబంధిత ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ, కమ్యూనిటీ సభ్యులు, సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ జంక్షన్ల వద్ద పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటూ కావాల్సిన ఇంజినీరింగ్ చర్యలు, ఫ్రీ లెఫ్ట్, రోడ్డు డైవర్షన్ వంటి చర్యలు చేపడుతూ ఎన్ఫోర్స్మెంట్ పెంచాలన్నారు.
ట్రాఫిక్‌పై మరింత అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించేలా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ విభాగానికి అధిక ప్రాధాన్యతనిస్తానని, అందుకు తగ్గట్టుగా సిబ్బంది, బడ్జెట్ ఇతర వనరులను సమకూరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందిని ఆయన అభినందించారు. కొన్ని నెలలుగా నగరంలో జరుగుతున్న పలు వేడుకలు, కార్యక్రమాలలో తమవంతు పాత్ర పోషించారని, మెరుగైన పనితీరు, టెక్నాలజీ వాడకంతో స్కోచ్ అవార్డులు గెలుపొందారంటూ వారి సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, కరుణాకర్, అదనపు డీసీపీలు రంగరావు, ప్రసాద్ పాల్గొన్నారు.