కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 20 : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు రంగురంగుల చీరెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తూ పేదల ముఖాల్లో చిరునవ్వును చూస్తున్న ప్రభుత్వం ఈ యేడాది సైతం బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి ప్రతి ఒక్కరికీ చీరెలందించేలా ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో బతుకమ్మ చీరెల పంపిణీకి జీహెచ్ఎంసీ యంత్రాంగం సిద్ధమైంది. సర్కిళ్లలోని డివిజన్ల వారీగా బతుకమ్మ చీరెల పంపిణీకి కేంద్రాలను గుర్తించి లబ్ధిదారులందరికీ పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
జోన్లో 2.91 లక్షలు..
కూకట్పల్లి జోన్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. ఐదు సర్కిళ్లలో 2,91,567 మంది లబ్ధిదారులుండగా 118 కేంద్రాల ద్వారా అర్హులందరికీ బతుకమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చీరెల పంపిణీ కోసం రేషన్ షాపుల సమీపంలోని ప్రభుత్వ భవనాలు, వార్డు కార్యాలయాలు, మహిళా మండలి భవనాలు, కమ్యూనిటీహాళ్లు, ఫంక్షన్హాళ్లను గుర్తించారు. సర్కిళ్ల పరిధిలోని వార్డుల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల ద్వారా లబ్ధిదారులందరికీ బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు.
18 ఏండ్లు నిండిన వారికి…
18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తాం. సివిల్ సప్లయ్ శాఖలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఉన్న వివరాల ప్రకారం బతుకమ్మ చీరలకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. గతంలో మాదిరిగానే సర్కిళ్లు, వార్డుల వారీగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను గుర్తించాం. మహిళలు ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుతో చీరెల పంపిణీ కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. నేటినుంచి అన్ని సర్కిళ్లలో బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభమవుతుంది. రెండుమూడు రోజుల్లో అర్హులందరికీ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తాం. చీరల పంపిణీకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. లబ్ధిదారులంతా సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం.
– వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి