సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణా వ్యస్థలో మెట్రోకు ప్రాధాన్యత పెరుగుతున్నది. నిర్ణీత సమయంలో గమ్యస్థానం చేరాలంటే మెట్రో రైలు ఒక్కటే ఏకైక మార్గంగా ఉంది. కరోనా తర్వాత క్రమంగా మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. కోర్ సిటీ నుంచి నగరం నలుమూలలా వెళ్లేందుకు మెట్రో రైలు మార్గాలు అందుబాటులో ఉండడంతో నగర వాసులు మెట్రోలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రోలో ఒకే రోజు 3.99 లక్షల మంది దాకా ప్రయాణం చేశారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు రోడ్డు మార్గంలో ఉన్నా, మెట్రో రైళ్లకు మాత్రం వర్తించకపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు.
ఇలా నగరంలో మెట్రో రైళ్లలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో ప్రయాణం చేస్తున్న కొందరు రద్దీ పెరిగిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కరోనాకు ముందు ప్రతి రోజూ 4లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణించే వారు. మళ్లీ రెండేండ్ల్ల తర్వాత అలాంటి రద్దీ మెట్రోలో కనిపిస్తోందని మెట్రో అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగానే మూడు కారిడార్లలో రైళ్లను నడుపుతున్నామని, ముఖ్యంగా కారిడార్-1లోని ఎల్బీనగర్-మియాపూర్, కారిడార్-3లోని నాగోల్-రాయిదుర్గం మార్గంలోనే ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.
ఐటీ కారిడార్ వెళ్లే మార్గంలో కోచ్ల సంఖ్య పెంచాలి…
రద్దీకి అనుగుణంగా మెట్రో సర్వీసులను ఆయా కారిడార్లలో పెంచాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు. మూడు మెట్రో కారిడార్లలో ఎక్కువగా ఐటీ కారిడార్ వెళ్లే నాగోల్-రాయిదుర్గం మార్గంలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్ల సంఖ్యను రద్దీకి అనుగుణంగా పెంచాలని నగర ఐటీ ఉద్యోగులు ట్విట్టర్ వేదికగా రద్దీ ఉన్న ఫొటోలను పోస్టు చేస్తున్నారు.
రద్దీ సమయాల్లో మెట్రో రైలు ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటోందని పలువురు ఐటీ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుకు వెళ్లాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో రద్దీగా ఉన్న రైళ్లలోనే వెళ్లాల్సి వస్తోంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటున్నా, రైళ్ల సంఖ్య తక్కువగానే ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మెట్రో అధికారులు రద్దీ సమయాల్లో నిర్ధేశిత మార్గాల్లో అదనపు రైళ్లను నడపాలని ప్రయాణికులు మెట్రో కోరుతున్నారు.