సిటీబ్యూరో/మెహిదీపట్నం, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి, పునరుద్ధరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44చోట్ల దిగుడు బావులను పునరుద్ధరించే ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ఈ మేరకు ఇప్పటికే ఆరు చోట్ల పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. బాపూఘాట్, గచ్చిబౌలి, గుడి మల్కాపూర్, శివంబాగ్, బన్సీలాల్‌పేట, సీతారాంబాగ్‌లో పరిరక్షణ చర్యలను చేపట్టారు. మరో 34 చోట్ల బావుల పునరుద్ధరణ పనులు జరుగుతుండగా, తాజాగా కుతుబ్షాహి టూంబ్స్‌లోని ఆరు మెట్ల బావులను పునరుద్ధరించారు. వారసత్వ కట్టడాల సంరక్షణ, పునరుద్ధరణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట కోనేరు బావి పునరుద్ధరణతో స్థానికంగా భూ గర్భజలాలు గణనీయంగా పెరగడం, బావి నీటిని పచ్చదనం పెంపునకు వినియోగిస్తుండడం గమనార్హం.
సెవన్టూంబ్స్లో ఉన్న కుతుబ్షాహి నవాబుల సమాధులతో పాటు బావులను (స్టెప్‌వెల్/బావోలిస్) కుడా, ఆగాఖాన్ ఫౌండేషన్ ఆమెరికా రాయబార కార్యాలయంతో కలిసి 2013 నుంచి సుమారు రూ. 400 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నారు. 2013లో బడీ బౌలిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచిన ఆగాఖాన్ ఫౌండేషన్ మొత్తంగా ఆరు బావులను గడిచిన 3 సంవత్సరాలలో శ్రమించి వేగంగా పునర్నిర్మించారు. 106 ఎకరాలలో విస్తరించి ఉన్న కుతుబ్షాహి టూంబ్స్‌లో ఉన్న మెట్ల బావులను పూర్తిగా అభివృద్ధి పరచడంతో ఈ వర్షాకాలంలో 20 మిలియన్ లీటర్ల నీటిని సేకరించినట్లు ఆగాఖాన్ ఫౌండేషన్ సీఈవో రతీష్నంద తెలిపారు. ఈ మేరకు గురువారం బడీబౌలి, ఈస్టర్న్ బౌలిలను ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఆగాఖాన్ ఫౌండేషన్ సీఈవో రతీష్ నందలతో కలిసి సందర్శించారు. హైదరాబాద్ నగరం ఉజ్వల భవిష్యత్ ఉన్న నగరమే కాదు చారిత్రత్మాక నగరం కూడా అని యూఎస్ అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సెవెన్‌టూంబ్స్ హెరిటేజ్ పార్కును తొలిసారిగా సందర్శించినట్లు, ఇదో అందమైన చారిత్రక ప్రదేశం అని ఆమె కొనియాడారు.
చారిత్రక కట్టడాలను పునరుద్ధరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. చార్మినార్, సర్దార్ మహల్, మిరాలం మండి, సెంట్రల్ లైబ్రరీ, మొజాంజాహీ మార్కెట్… ఇలా నగరంలోని వారసత్వ కట్టడాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హెరిటేజ్ శాఖ, ఆగాఖాన్ ఫౌండేషన్, జీహెచ్ఎంసీ, కుడా సంయుక్తంగా పునరుద్ధరించిన సెవెన్ టూంబ్స్ కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్కులో ఆరు మెట్ల బావులను గురువారం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కుతుబ్‌షాహీ టూంబ్స్ పార్కులో వంద వరకు స్మారక చిహ్నాలున్నాయని, 2013 నుంచి పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. రెండేండ్లుగా హెరిటేజ్ పార్కులో ఉన్న బావులను పునరుద్ధరించడానికి యూఎస్ అంబాసిడర్స్ ఫండ్ అందించడాన్ని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో పలు సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయని చెప్పారు. బావుల పునరుద్ధరణలో భాగస్వామ్యమైన ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులను, యూఎస్ అంబాసిడర్స్ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ అభినందించారు.
సెవన్టూంబ్స్లోని మహ్మద్ కుతుబ్‌షా సమాధికి దక్షిణం వైపు ఉన్నది. ఇది పూర్తిగా పాడుబడటంతో 2013 వ సంవత్సరంలో దీనిని పూర్తిగా ఫునరుద్ధరించారు. బడీబౌలి 16.5 మీటర్ల లోతుతో పునరుద్ధరించారు.
సెవన్‌టూంబ్స్ జంషీడ్ కులీకుతుబ్‌షా పశ్చిమ వైపున ఉన్న పశ్చిమ బౌలి నీటి సామర్థ్యం 3.7 మిలియన్ లీటర్లు. దీనిని రిటైనింగ్ వాల్స్ 18 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ బావిని దుర్గం చెరువు నీళ్లతో నింపారు. అదే విధంగా కుతుబ్‌షాహిల కాలంలో ఈ బావి నుంచే గోల్కొండ కోటకు పైపులైన్ ద్వారా నీటి సరఫరా జరిగేది. నవాబులు ఈ నీటినే తమ అవసరాలకు వాడుకునేవారు.
హమామ్ బౌలిని కుతుబ్‌షాహిలు స్నానాల కోసం వాడేవారు. పూర్తిగా పాడైన ఈ బావిని ఇరానీల స్నానాల గదుల పద్ధతిలో పునర్నిర్మించారు. ఈ బావిలోకి వెళ్లడానికి మెట్లను నిర్మించారు. దీని నీటి సామర్థ్యం 4.7 మిలియన్ లీటర్లు.
ఈద్గా బౌలిని పెద్ద, పెద్ద గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. అన్ని బావుల కన్నా భిన్నంగా దీనిని ఎంతో నైపుణ్యంతో
నిర్మించారు. ఇందులో గ్రానైట్ రాళ్లను చేతి పనితో తయారు చేసి పెట్టారు. మెట్లు మొత్తం చాలా జాగ్రత్తగా పెట్టడానికి
నిపుణులైన పనివారు శ్రమించారు. 25 మీటర్ల లోతు వరకు ఈ బావిలోకి మెట్లు ఉన్నాయి. ఈద్గా బౌలి చుట్టూ రిటైనింగ్‌వాల్‌ను కూడా పెద్ద సైజు రాళ్లతో నిర్మించడం గమనార్హం.
కుతుబ్‌షాహిల కాలంలో నిర్మించిన ఈ బావి పూర్తిగా మట్టిలో కూరుకుపోయి ఉండగా ఆగాఖాన్ ఫౌండేషన్ వారు దీనిని బయటకు తీశారు. ఈ బావి నీటి సామర్థ్యం 2.8 లీటర్లు.
ఈస్టర్న్ బౌలి పూర్తిగా భూమిలోకి పూడుకుపోయి ఉండగా దానిని తవ్వి బయటకు తీశారు. తూర్పు బావిని ఎంతో కష్టపడి పునర్నిర్మించారు. ఈ బావి సెవన్టూంబ్స్లో నుంచి దక్కన్పార్కులోకి వచ్చే వర్షం నీటితో నిండేలా రూపొందించారు. ఇందులో నీటి సామర్థ్యం 2.5 మిలియన్ లీటర్లు.