మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 15: మారుమూల గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ బిషప్‌గా, ఇప్పుడు కార్డినల్‌గా పూల ఆంథోనీ నియమితులు కావడం ఎంతో గర్వించదగిన విషయమని ముంబాయి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేషియస్ అన్నారు. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ చేతుల మీదుగా ఆంథోనీ కార్డినల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ మెరీస్ హైస్కూల్ ఆవరణలో కృతజ్ఞతా పూర్వక మహోత్సవం, ప్రార్థనలు నిర్వహించారు. బిషప్ హౌజ్ నుంచి భారీ ర్యాలీగా సెయింట్ మెరీస్ స్కూల్‌కు కార్డినల్ ఆంథోనీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముంబాయి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేషియస్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుంచి 37 సంవత్సరాల తర్వాత, తెలుగు రాష్ర్టాల నుంచి మొట్టమొదటి కార్డినల్‌గా పూల ఆంథోనీ నియమితులు కావడంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో యూఎస్, ఇటలీ తర్వాత ఆరుగురు కార్డినల్స్ ఉన్న దేశం భారత్ మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆగ్రా కార్డినల్ రఫేమాంజలి, వికార్ జనరల్ గాబ్రియేల్, బెర్హంపూర్ బిషప్ శరత్ చంద్రనాయక్, బెంగళూర్ వికార్ జనరల్ సీ ఫ్రాన్సిస్, హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ఫాదర్లు, తెలుగు రాష్ర్టాలకు చెందిన 15 మంది బిషప్‌లు, 500 మంది మత గురువులు పాల్గొన్నారు.
అనంతరం కార్డినల్ పూల ఆంథోనీ మాట్లాడుతూ భారతదేశంపై, తెలుగు రాష్ర్టాలపై పోప్ ఫ్రాన్సిస్ ఎంతో దైవ ప్రేమను చూపుతూ తనను కార్డినల్‌గా నియమించి మరిన్ని బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దైవ సేవ, పరిచర్య అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని వెల్లడించారు.