సికింద్రాబాద్, సెప్టెంబర్ 15 : కంటోన్మెంట్ ప్రాంతం కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం ఇక్కడ అమలుకు నోచుకోవడంలేదు. ఒక్క పథకమైనా కంటోన్మెంట్ పరిధిలో ప్రవేశపెట్టిన దాఖలాలు భూతద్ధం పెట్టి వెతికినా కనిపించవు. కానీ ఇక్కడి కాషాయపు నేతలు మాత్రం అంతా కేంద్రం చలువే అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ కాలం గడుపుతున్నారు. కనీసం కేంద్రంలో అమలవుతున్న ఒక్క పథకం పేరైనా కమలం నేతలకు తెలియక, అమలు చేయలేక బోర్డు పరిధిలోని ప్రజలకు మాయ మాటలు చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలకు ఏమి చెప్పాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో కాషాయం నేతలు పడ్డారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేంద్రమే అన్ని పథకాలు ఇస్తున్నదని చెప్పుకుంటూ కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్న ఓ బీజేపీ నేత పథకాల పేర్లు చెప్పడంలో మాత్రం నాలికను మడత పెడుతున్నారు. కనీసం ఒక్క కేంద్ర పథకమైనా ఇక్కడ అమలు చేయకుండా అంతా మేమే చేస్తున్నామని చెప్పుకోవడంతో ప్రజలనుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా స్థానికులు మీ పథకాలు ఏవని ప్రశ్నిస్తే చల్లగా అక్కడి నుంచి జారుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. ప్రధానంగా చెప్పాలంటే బోర్డు పరిధిలోని ప్రజలు రాష్ట్ర పథకాలతోనే ముందుకు సాగుతుండగా, కేంద్ర పథకాలు ఏవో కూడా ఇక్కడి బీజేపీ నేతలకు తెలువకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఇవ్వకుండా బోర్డు అధికారులు క్రీడాకారుల భవితపై నీళ్లు చల్లుతున్నారు. రోడ్ల విస్తరణ, స్కైవేల ఏర్పాటుకు రక్షణ శాఖ భూములు ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు కేంద్రం పూనుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
కంటోన్మెంట్లో ఒక్క కేంద్ర పథకమైనా అమలవుతుందా అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి గతంలో బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఇదిలా ఉండగా సుమారు 21 సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతున్నాయో కంటోన్మెంట్లో సైతం అదే మాదిరిగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆయా వార్డుల్లో బ్యానర్లను ఏర్పాటు చేసే అంశంపై కసరత్తు ప్రారంభించారు.
దళితబంధు పథకం ప్రపంచంలోనే విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. దేశంలో అంబేడ్కర్ ఆలోచనలు, జగ్జీవన్‌రాం ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. ఒకప్పుడు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరయ్యేవి. వీటిని ఇచ్చేందుకు బ్యాంకులు అనేక ఇబ్బందులు పెట్టేవి. పట్టుమని పది మందికి సైతం ఏడాదిలో రుణాలు వచ్చేవి కాదు. ఇప్పుడు అందుకు భిన్నంగా పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం అంటే మామూలు విషయం కాదు. దళితబంధుతో కూలీలు, ఆటోలు, కారు డ్రైవర్లు యజమానులు అవుతున్నారు. దళితబంధు పథకంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరాలి. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల అభివృద్ధి కోసం, దళితవర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న మహానుభావుడు.
– జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు
గతంలో వేరేవాళ్ల దగ్గర సెంట్రింగ్ పని చేసేది. దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షలు వచ్చినై. ఈ పైసలతో సొంతంగా సెంట్రింగ్ సామాగ్రి కొనుగోలు చేసిన. నాడు కూలీగా పనిచేసిన చోటనే నేడు ఓనర్‌గా అద్దెకు ఇస్తున్నా. నాలాగే చాలా మంది దళితుల జీవితాలను మార్చిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.
మాది కంటోన్మెంట్‌లోని జయప్రకాశ్‌నగర్ కాలనీ. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నాకు 71 ఏండ్లు ఉన్నప్పటికీ చెప్పులరిగేలా తిరిగినా గత ప్రభుత్వాలు పెన్షన్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నా. నెలనెలా పెన్షన్ వస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
– జె. రూపమ్మ, పెన్షన్, లబ్ధిదారులు, జయప్రకాశ్‌నగర్
నాకు పెండ్లి చేసేందుకు డబ్బులు లేక మా తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంతో పెండ్లి చేసిండ్రు. నాలాంటి ఆడబిడ్డలకు మేనమామగా మారి పెండ్లీలు చేసేందుకు అండగా నిలుస్తున్నరు.
– జీఎం.నీతు, కల్యాణలక్ష్మి లబ్ధిదారు,
రిసాలబజార్, బొల్లారం.