మాదాపూర్, సెప్టెంబర్ 15: ప్రపంచానికే ఔషధాలను సరఫరా చేసే అతి పెద్ద హబ్‌గా భారత ఔషధ పరిశ్రమ ఎదుగుతున్నదని అరబిందో ఫార్మా పరిశ్రమ డైరెక్టర్ మదన్ మోహన్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘అనాలిటికా అనకాన్ ఇండియా-ఇండియా ల్యాబ్ ఎక్స్ పో’ పేరిట గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్, హెటిరో డ్రగ్స్ డైరెక్టర్, ఫార్ములేషన్ జీపీ రావు, ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్, ఇండియన్ డ్రగ్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు విరించి షా, చక్రవర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2030 నాటికి భారతీయ ఫార్మా పరిశ్రమ 130 బిలియన్లకు చేరుకోనుందని విశ్లేషించారు.
ఔషధాల ఉత్పత్తిలో ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న భారత్ త్వరలోనే అగ్రస్థానానికి చేరుకోనున్నట్లు చెప్పారు. ఇటువంటి ఎగ్జిబిషనల్ వల్ల హైదరాబాద్‌తో పాటు యావత్ భారతదేశంలోని ఔషధ పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతున్నదని అభినందించారు. సాధారణ వ్యాపారాలు, పేటెంట్ల గడువు ముగియడంతో ఔషధ రంగ అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఔషధ పరిశ్రమ 11 శాతం వృద్ధిని సాధించడం ఒక రికార్డేనని తెలిపారు. ఔషధాల తయారీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలన్నీ మన దేశానికి చెందిన తయారీ దారుల వద్ద ఉన్నాయని చెప్పారు.
కొవిడ్ మహమ్మారి తరువాత ఇలాంటి ట్రేడ్ షోలు పరిశ్రమలకు గొప్ప అవకాశంగా మారాయని తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో క్రోమాటోగ్రాఫ్లు, స్పెక్ట్రోస్కోప్లు, మైక్రోస్కోప్‌లు, ఇమేజింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, మెడిసిన్, డయాగ్నస్టిక్స్‌తో పాటు ఫార్మా సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో 400 మంది సరఫరాదారులు, 5 వేలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శించారు. 15 వేల మందికి పైగా ప్రదర్శనను సందర్శించేందుకు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ అంబాసిడర్, వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ ఆర్మిన్ విట్మాన్, ఎగ్జిబిషన్ డైరెక్టర్ మెస్సే మున్చెన్ తదితరులు పాల్గొన్నారు.