కీసర, సెప్టెంబర్ 15 : టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర గ్రామానికి చెందిన బొంతు రమేశ్ ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా మంజూరైంది. గురువారం మృతుడి భార్య బొంతు సువర్ణకు రూ.2లక్షల సభ్యత్వ బీమా చెక్కును మంత్రి మల్లారెడ్డి అందజేశారు. అలాగే కీసరకు చెందిన వడ్డెర లక్ష్మికి మంజూరైన రూ.42వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… పార్టీలో పనిచేసే వారికి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. మేడ్చల్ జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకొన్న అర్హులైన వారందరికి ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, సర్పంచ్ మాధురి వెంకటేశ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మణ్‌శర్మ, పంచాయతీ సభ్యులు శంకర్‌గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్‌రాజ్, ఉపాధ్యక్షుడు సుమన్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, సెప్టెంబర్15 : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి 5వ డివిజన్ రాంనగర్ కాలనీకి చెందిన ఆర్ గోపాలకృష్ణ వైద్య సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు అతడికి రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి స్థానిక కార్పొరేటర్ బొడిగ స్వాతితో కలిసి లబ్ధిదారుడికి గురువారం అందజేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదన్నారు.