సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : నకిలీ ఈ మెయిల్స్‌తో సమాచారం సేకరించి.. అకౌంట్ మారిందంటూ బడా సంస్థలను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉంటున్నాయి. ఈ మెయిల్స్ హ్యాక్ చేస్తున్న నేరగాళ్లు ఆ మెయిల్ ద్వారా బాధితుల బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు, వ్యాపార పరమైన వ్యవహారాలను తెలుసుకుంటున్నారు. బడా సంస్థల డబ్బు కాజేసే క్రమంలో సైబర్ నేరగాళ్లు.. నేరుగా సంస్థలకు మెయిల్స్ పంపిస్తూ.. రోజు మీరు వినియోగించే బ్యాంకు ఖాతా పనిచేయడం లేదు.. కొత్తగా మరో ఖాతా తెరిచామంటూ నమ్మిస్తారు. బ్యాంక్ ఖాతా మారిందా.. లేదా.. ఏదీ తెలుసుకోకుండా సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మిధానీకి రూ.40 లక్షలు, అమీర్‌పేటలోని ఓ వ్యాపారికి రూ.1.19కోట్లు మోసం చేశారు. రక్షణ సంస్థకు సంబంధించిన ఈ మెయిల్స్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. డబ్బు కాజేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మోసం జరిగిందిలా..
మిధాని సంస్థ తమకు కావాల్సిన అల్యూమినియంను కెనడాలోని నేచర్అల్యూ.కామ్ సంస్థ నుంచి కొనుగోలు చేసే క్రమంలో ఈ మెయిల్ సంభాషణ చేశారు. సరుకు పంపిస్తాం.. ఆ తర్వాత మీరు డబ్బు డిపాజిట్ చేయండి.. అంటూ కెనడా సంస్థ సూచించింది. సరుకు మిధానికి వచ్చేసింది. వెంటనే మేం మీకిచ్చిన బ్యాంకు ఖాతా పనిచేయడం లేదు.. మరో ఖాతాకు పంపించండి.. అంటూ నేచర్- అల్యూ.నెట్ అనే పేరుతో ఉన్న ఈ మెయిల్ ద్వారా ఒక మెయిల్ పంపించారు. వాస్తవమేనని నమ్మిన మిధాని అధికారులు కొత్తగా వచ్చిన ఈ మెయిల్‌ను చూసి అందులో డబ్బు డిపాజిట్ చేశారు. కెనడా సంస్థ డబ్బు గూర్చి మిధాని సంస్థ ప్రతినిధులను అడిగింది. ఇది వరకే డిపాజిట్ చేశామంటూ మిధాని ప్రతినిధులు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలాఉండగా.. మిధాని ఈమెయిల్ కాకుండా, కెనడా సంస్థ ఈమెయిల్‌ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరింత లోతైనా దర్యాప్తు జరిపితే ఎక్కడ ఈ మెయిల్ హ్యాక్ అయ్యింది.. ఎవరు చేశారు.. అనే విషయం తెలుస్తుందని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
గతంలో రూ.కోటి కొట్టేశారు..
అమీర్‌పేటలోని పిస్టిన్స్ అండ్ రింగ్స్ వ్యాపారికి ఏప్రిల్ నెలలో నకిలీ ఈ మెయిల్‌తో సైబర్ నేరగాళ్లు రూ. 1.19 కోట్లు కొట్టేశారు. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు సంబంధించిన పిస్టిన్స్, ఇతర ముడి సరుకును చైనాలోని మ్యాన్ కాంగ్ డింగ్ జాన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ నుంచి నగర వ్యాపారి తెప్పించుకుంటాడు. ఈ క్రమంలోనే పిస్టిన్స్, రింగ్స్ కోసం చైనా కంపెనీకి ఈ మెయిల్ ద్వారా ఆర్డర్ పెట్టాడు. ఆ కంపెనీ తమకు రూ. 1.19 కోట్లు పంపిస్తే సరుకు డెలివరీ చేస్తామంటూ.. ఈమెయిల్లో ఇన్ వాయిస్ పంపించారు. నాలుగైదు రోజుల తర్వాత నగరానికి చెందిన సంస్థకు మరో ఈ మెయిల్ వచ్చింది. కొన్ని సాంకేతిక సమస్యలతో మేం గతంలో ఉపయోగించిన బ్యాంకు ఖాతాను ఉపయోగించడం లేదు.. మరో ఖాతాకు ఆ మొత్తాన్ని పంపించాలంటూ ఆ మెయిల్ ఉంది. ఆ మెయిల్ ఒరిజినల్ కంపెనీదిగా భావించిన హైదరాబాద్ వ్యాపారి ఆ మొత్తాన్ని కొత్త ఖాతాలోకి బదిలీ చేశాడు. డబ్బు పంపినా సరుకు ఇంకా రాకపోవడంతో చైనా కంపెనీకి ఫోన్ చేశాడు. తమకు డబ్బు రాలేదని, అందువల్లే సరుకు పంపించలేదని తేల్చి చెప్పారు. దీంతో బాధితుడు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలను ఆరా తీశాడు. ఆ డబ్బు డిపాజిట్ చేసిన ఖాతా ఇంగ్లాండ్‌లో ఉన్నట్లు గుర్తించారు.