పహాడీషరీఫ్, సెప్టెంబర్ 12: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే రహదారికి మోక్షం లభించింది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్ఎన్డీపీ నిధులు నుంచి రూ.3.10 కోట్లు కేటాయించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్ల విస్తరణకు నిధులు మంజూరై పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ పనులు పూర్తి చేస్తున్నారు. అనంతరం రోడ్డు అభివృద్ధి చేస్తారు. ఇక నుంచి ఇబ్బందులు తప్పనున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ, మరమ్మతులు చేయడంతో ప్రయాణ సౌలభ్యం మెరుగు పడుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఉన్న సమస్యకు తెర పడనున్నదని ప్రయాణికులు సంబుర పడుతున్నారు.
సంతోషంగా ఉంది..
గుంతల రోడ్లతో నానా ఇబ్బందులు పడ్డాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాలనీలో అభివృద్ధి జరుగుతుంది. డ్రైనేజీ అభివృద్ధితో దీర్ఘకాలికంగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ప్రస్తుతం రోడ్డు అభివృద్ధి చేస్తుండటంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
– విశాల్‌గౌడ్, పహాడీషరీఫ్
మంత్రికి కృతజ్ఞతలు..
పహాడీషరీఫ్‌లోని మామిడిపల్లికి వెళ్లే రహదారికి నిధులు కేటాయించిన మంత్రికి కృతజ్ఞతలు. గుంతలు పడ్డ రహదారితో ఇన్నాళ్లు చాలా ఇబ్బందులు పడ్డాం. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి నిధులు కేటాయించి.. పనులకు శంకుస్థాపన చేశారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
– కొండల్ యాదవ్, 14వ వార్డు కౌన్సిలర్
దశల వారీగా అభివృద్ధి
దశలవారీగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ, రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ముంపు సమస్య పరిష్కారానికి రూ. 10.60 కోట్లతో డ్రీమ్, గ్రీన్సిటీల్లో బాక్స్ డ్రైన్ పనులు కొనసాగుతున్నాయి. వర్షాలకు గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేయిస్తాం. పారిశుధ్యంపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నాం.
– అబ్దుల్లా సాది, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్