కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 12 : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని, వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి జంట సర్కిళ్ల కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈనెల 16న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. బాలాజీనగర్ కైత్లాపూర్ గ్రౌండ్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఉంటుందని మహిళా సంఘాల సభ్యులు, పాఠశాలల కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వజ్రోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా 15వేల మందితో కలిసి జాతీయ జెండాలతో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. కైత్లాపూర్ వేదికపై కళాకారులతో ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వేల మందితో చేపట్టనున్న ర్యాలీ సందర్భంగా రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 17న ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, ఈనెల 18న కాళాకారులకు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మూడ్రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో యావత్ ప్రజానీకం భాగస్తులు కావాలని..వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, ఉప కమిషనర్లు రవికుమార్, రవీందర్‌కుమార్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, బాలానగర్ పోలీస్స్టేషన్ల సీఐలు, ట్రాఫిక్ సీఐలు, జీహెచ్ఎంసీ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.