సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనం పూర్తవ్వడంతో సాగర్‌లో వ్యర్థాల తొలగింపును అధికారులు వేగవంతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిమజ్జనం తర్వాత చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించేందుకు ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు సాగర్‌లో ఐదు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు.
3-4 రోజుల వ్యవధిలో..
సాగర్‌లో తీసిన చెత్తను ఒడ్డుకు చేరుస్తున్నామని, అక్కడి నుంచి లారీల ద్వారా లోయర్ ట్యాంక్ బండ్ కింద ఉన్న కేంద్రంలోకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన ఘట్టం పూర్తికావడంతో పూర్తి స్థాయిలో వ్యర్థాల తొలగింపుపైనే దృష్టిని కేంద్రీకరించినట్లు చెప్పారు. 3-4 రోజుల వ్యవధిలో మరో 6వేల మెట్రిక్ టన్నులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతేడాది నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్ నుంచి సుమారు 10వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించగా, ఈసారి అంతకంటే ఎక్కువ మొత్తంలోనే తొలగించాల్సి ఉంటుందని తెలిపారు.
మహాగణపతి కోసం..
హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ భారీ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఎన్టీఆర్ మార్గ్‌లో ముందుగానే పూడిక తీత పనులు చేపట్టారు. 50 అడుగులకు పైగా ఉండే భారీ విగ్రహం నీళ్లలో పూర్తిగా మునిగేందుకు వీలుగా లోతుగా పూడికను తీశారు. దీంతో శుక్రవారం జరిగిన నిమజ్జనంలో మహాగణపతి విగ్రహం సంపూర్ణంగా మునిగింది. హెచ్ఎండీఏ అధికారులు ముందుగా చేపట్టిన పూడిక తీత పనుల వల్లే ఇది సాధ్యమైంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేశ్ నిమజ్జనం అనంతరం వ్యర్థాలను తొలగించే పనులను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 7,334 మెట్రిక్ టన్నుల చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రతిరోజు తిరిగే 330 వాహనాలతో పాటు వ్యర్థాలను సేకరించేందుకు మరో 97 వాహనాలు, 40 జేసీబీలు, అదనంగా మరో 27 జేసీబీలను వినియోగించి 74 కొలనుల నుంచి వ్యర్థాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ మార్గ్‌లో..
ఎన్టీఆర్ మార్గ్‌లో గణేశ్ నిమజ్జనాలు నిరంతరాయంగా కొనసాగాయి. ఈ ప్రక్రియ వినాయకచవితి తర్వాతి రోజు నుంచే ప్రారంభమవ్వగా, శుక్రవారం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం తర్వాత పెద్ద సంఖ్యలో ప్రతిమలను నిమజ్జనం చేశారు. శనివారం సాయంత్రం నాటికి మొత్తం 1538 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు.