నవరాత్రులపాటు ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన గణనాథుడు అనంతచతుర్దశి పర్వదినాన గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. భక్తజనులు జయజయధ్వానాలు పలుకుతుండగా విఘ్నేశ్వరుడు ఊరేగుతూ మంగళనీరాజనాలు అందుకున్నాడు. బొజ్జగణపయ్యకు లక్షలాదిమంది భక్తులు దారిపొడవునా భజనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి సాగనంపారు. ఉత్సవకమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగుల ఎత్తున ప్రతిష్ఠితమైన ఖైరతాబాద్ మట్టి మహాగణపతిని సాయంత్రం 7 గంటలకు నిమజ్జనం చేశారు.
బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు గణనాయకుల శోభాయాత్ర భక్తిప్రపత్తులతో ప్రశాంతంగా సాగింది. దారిపొడవునా ప్రభుత్వ సిబ్బంది పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూనే హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేశారు. ముగ్గురు పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్‌భగవత్, స్టీఫెన్ రవీంద్రల ఆధ్వర్యంలో పోలీసులు అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా కంటికి రెప్పలా వ్యవహరించారు. కాగా, బాలాపూర్ గణేశ్లడ్డు అత్యధికంగా రూ.24.60 లక్షలు పలికింది.
అమోమయ పరిస్థితులు కల్పించారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నది. మన సంసృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా సీఎం కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే ఓ గుర్తింపు ఉన్నది. ప్రశాంత వాతావరణంలో గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులు కల్పించాం. నిర్వాహకులను అయోమయానికి గురిచేసేలా కొందరు ఏర్పాట్లపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఎవరూ నమ్మవద్దు.
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన
నిమజ్జన వేడుకలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్ లతో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలు దేరి ట్యాంక్ బండ్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో యాత్రను పరిశీలించారు.
రాత్రి 8 తర్వాత పెరిగిన తాకిడి!
ఉదయం నుంచి నెమ్మదిగా సాగిన శోభాయాత్ర రాత్రి 8 గంటల తర్వాత పెరిగిపోయింది. బాలాపూర్ గణపతి బయలుదేరిన కొద్ది సేపటికే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్సవ గణపయ్యలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. బారులు తీరిన ఉత్సవ విగ్రహాలతో ట్యాంక్‌బండ్, నెక్లస్రోడ్ పరిసరాలు భక్తుల జయజయ ధ్వానాలతో మారుమోగాయి. అంతేకాకుండా హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్ చెరువు, కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్ద గణపయ్యలకు ఘనమైన వీడ్కోలు పలికారు. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల ట్రిప్పులను పెంచింది.
ఉదయం 5:05 గంటలకు మొదలైన బాలాపూర్ శోభాయాత్ర
హైదరాబాద్ నగరంలో దశాబ్దాల నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా బాలాపూర్ గణపతికి తెల్లవారుజామున ఉత్సవ సమితి ప్రత్యేక పూజలు జరిపి శోభాయాత్రను ప్రారంభించింది. ఉదయం 5:05 గంటలకు మండపం నుంచి ఊరేగింపు ప్రారంభంకాగా సుమారు ఐదు గంటల పాటు బాలాపూర్ పురవీధుల్లోనే తిరిగి 10:25గంటలకు బొడ్రాయి వద్దకు చేరింది. మధ్యాహ్నం 3:05 గంటలకు లడ్డూ వేలం నిర్వహించారు. అనంతరం బాలాపూర్ వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరిన తర్వాత మిగతా ఉత్సవ విగ్రహాలు కూడా నిమజ్జనానికి బయలుదేరి వచ్చాయి.
12:20 గంటలకు మొదలైన ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభయాత్ర 12:20గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం 7గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. 50 అడుగుల భారీ మట్టి మహా గణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమ పూర్తి స్థాయిలో నీటి మునగడం గమనార్హం.
సాగర తీరంలో ముచ్చటైన గణపతులు
శుక్రవారం ఉదయం నుంచే నగర వీధులు గణపయ్య నామ స్మరణతో మారుమోగాయి. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, సఫిల్‌గూడ, కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో నిమజ్జనానికి వేల సంఖ్యలో ఉత్సవ విగ్రహాలు తరలివచ్చాయి. కిలోమీటర్ల పొడవున రోడ్లపై నిలిచిపోయాయి. వర్షం కారణంగా శోభాయాత్ర నెమ్మదిగా సాగగా.. తీరొక్క గణపతి ప్రతిమలను భక్తులు తిలకిస్తూ సందడి చేశారు.
మంత్రులు, మేయర్ పర్యటన
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, ఏవిధమైన ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి నగరపాలక యంత్రాంగానికి సహకరించాలని భక్తులు, గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేశారు. పలు ప్రాంతాల్లో పర్యటించి గణేశ్ నిమజ్జన తీరును పర్యవేక్షించారు. ముందుగా ఖైరతాబాద్ గణేశ్ మండపానికి చేరుకొని పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బాలాపూర్ గణేశ్ మండపం వద్దకు చేరుకొని లడ్డూ వేలం పాటను తిలకించారు. అకడి నుండి చార్మినార్, మొజంజాహి మారెట్ వద్దకు చేరుకొని నిమజ్జనానికి వెళ్తున్న వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు. తదనంతరం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని హుస్సేన్ సాగర్‌లో మేయర్ విజయలక్ష్మితో కలిసి బోట్లో తిరుగుతూ గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించారు. కాగా విగ్రహాలు నిమజ్జనం పూర్తి కాగానే చెత్తను పూర్తిగా తొలగించేలా ఎప్పటికప్పుడు మేయర్ సమీక్షించారు.