సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ): మాదాపూర్‌కు చెందిన శశికిరణ్ దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. నిత్యం ఫోన్‌కాల్స్, ఆన్లైన్ మీటింగ్‌లు, ఆఫీసు పనులతో బిజీగా ఉంటారు. వీరిద్దరి పిల్లలు తల్లిదండ్రుల ఆలనకు దూరమవుతూ లోలోనకుంగిపోయారు. సమయానికి తినకపోవడం, తీసుకున్న ఆహారం కూడా బలవర్థకమైనది కాకపోవడంతో తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మల్కాజిగిరిలో నివాసముండే గోపాల్‌రెడ్డి వ్యాపారి. భార్య ప్రైవేటు ఉద్యోగి. నిత్యం పనుల్లో నిమగ్నం కావడం వల్ల పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు.
మహానగరంలో చాలావరకు చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల రక్షణ దారితప్పుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో పిల్లల పెంపకంలో అతి ముఖ్యమైన తొలి అయిదేళ్లు నాణ్యతలేని రోజులుగా కరిగిపోతున్నాయి. బిజీలైఫ్‌తో పిల్లలకు ప్రేమను పంచడంలో తల్లిదండ్రులు దూరమవుతున్నారు. ఇలాంటి పిల్లలు మానసికంగా, శారీరకంగా మైల్‌స్టోన్స్‌ను అధిగమించడంలో వెనుకంజలో ఉంటున్నారు. చిన్నారుల పెంపకంలో తొలి అయిదేళ్లు చాలా కీలకమని, వారి ఆలనాపాలన దగ్గరుండి చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన నాటి నుంచి 5 ఏండ్లు వచ్చే వరకు వారి శారీరక పెరుగుదలను పరిశీలించి..అందుకనుగుణంగా తల్లిదండ్రులు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు, బాధ్యతల్లోపడి పిల్లల పెంపకాన్ని ఇతరుల చేతిలో పెడుతుండడంతో భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం పడనుంది. వ్యక్తిగత జీవితంలో పిల్లల పెంపకానికి రోజులో కొంత సమయం కేటాయించడం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు.
పుట్టిన ఏడాదిలోముద్దుముద్దుగా..
ఏడాదిలోపు చిన్నారులు ‘మా..మా..తా.. తా.. డా..డా’ అనే శబ్ధాలు చేస్తారు. పసిపిల్లలు తొలిసారిగా నవ్వడం..అడుగులు వేయడం.. బైబై చెబుతూ చేతులు ఊపడం వంటివి ముచ్చటగొలుపుతాయి. అంతేకాదు వినడం, అర్థం చేసుకోవడం కూడా ఇదే దశలో మొదలవుతుంది. మనుషులను గుర్తించడం, వస్తువుల పేర్లు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ దశలో పిల్లల మానసిక అభివృద్ధిలో భాగంగా తల్లిదండ్రులతో ఆత్మీయబంధం ఏర్పడుతోంది. కన్నపేగులను ప్రేమగా జోకొట్టడం.. ఎత్తుకోవడం..లాలించడం వారితో ఆడటం వల్ల అనుబంధాలకు పునాది పడుతుంది. ఈ దశలో తల్లిదండ్రులు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలతో మాట్లాడాలి. తల్లిదండ్రుల మాటలను గుర్తుపడుతారు. చిన్నారులు ఏవో పదాలు పలకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆ పదాలను ఉచ్ఛరించి కొత్త పదాలను వారికి పరిచయం చేయాలి. ఇది వారిలో స్పీచ్ డెవలప్మెంట్కు ఉపయోగపడుతుంది. పాటలు పాడి వినిపించడం.. సంగీతం వినిపించడం ద్వారా మక్కువ కలుగుతుంది. లాలించడం, ఎత్తుకోవడంతోపాటు తగినంత సమయం కేటాయించడం ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులే తమకు పెద్ద రక్షణ అనే భావాన్ని పెంపొందించుకుంటారు.
ఒకటి నుంచి రెండేండ్లు
చిట్టిపొట్టి అడుగులు వేస్తూ ఇల్లంతా కలియతిరుగుతుంటారు. తమ చుట్టూ ఉండే పరిసరాలను అవగాహన చేసుకుంటారు. కొత్త వస్తువులు, నూతన వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ వయసులో పిల్లలు స్వతంత్రంగా ఉండటమే కాకుండా కొంత మొండివైఖరి కూడా ప్రదర్శిస్తారు. ఈ వయసులో తల్లిదండ్రులు వారికి చిన్నచిన్న కథలు చదివి వినిపించాలి. వస్తువులు, శరీర భాగాలను గుర్తించాలని వారికి నేర్పించాలి. చిన్న పిజల్స్, వస్తువులను గుర్తించడం, కొత్త విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించాలి. పిల్లలు స్వయంగా ఆహారం తీసుకునేలా, దుస్తులు వేసుకునేలా నేర్పించాలి. పార్కు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి వస్తువులు లేదా ప్రదేశాలను గుర్తుపట్టే సామర్థ్యాన్ని పెంచాలి.
మూడేండ్లు..
ఈ సమయంలో ఎంతో ఆలోచనా శక్తి, సామాజిక, మానసిక మార్పులను పిల్లలు పొంది తమ చుట్టూ ఉన్న కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. వస్తువులను, వాటి రంగుల, ఆకారాన్ని బట్టి గుర్తించి వేరు చేయడం చేస్తారు. పెద్దలను తోటి చిన్నారులు అనుకరిస్తారు. వివిధ రకాలైన మానసిక ఉద్వేగాలను ప్రదర్శిస్తారు. ఈ వయసులో వీరి అల్లరిని కంట్రోల్ చేయడం కత్తిమీద సామే. పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడానికి కొంత ప్రత్యేక సమయాన్ని పేరేంట్స్ కేటాయించాలి. ఇతరులను అనుకరించడం వంటి ఆటలను పిల్లలతో ఆడించాలి. వారి పేరు, వయసు, ఇతరులకు చెప్పేలా ప్రోత్సహించాలి. చిన్న చిన్న పాటలను పాడిస్తూ ప్రోత్సహించాలి.
ఐదేళ్ల లోపు..
తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతారు. ఇతర పిల్లలతో కలిసి స్వతంత్రంగా ఉంటారు. కుటుంబసభ్యులు, చుట్టూ ఉండే వారి ప్రభావంతో పిల్లలు తమ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటారు. అయితే పిల్లలు ఎదిగారని భావించి చిన్నచిన్న విషయాలకు కొప్పడడం, అరవడం చేయకూడదు. దీనివల్ల సున్నిత మనస్తత్వం దెబ్బతింటుంది. వారి మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ దశలో కొన్ని మెలకువలు పాటించడం వల్ల వారిని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు సమయం కేటాయించాలి
పిల్లలకు తల్లిదండ్రులు తప్పకుండా సమయం కేటాయించాలి. అది వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది. చిన్నారుల్లో స్వతంత్ర అభిప్రాయాలు, ఆలోచించే శక్తి ఉంటుందని విశ్వసించండి. మీ సొంత అభిప్రాయాలు, ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దు. వారి అభిరుచులను గౌరవించాలి. మంచి పనిచేస్తే ప్రోత్సహించాలి. తప్పు చేస్తే దండించకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. పిల్లలు చేసే తప్పులకు వారినే బాధ్యత వహించేలా చేయాలి. రోజువారి అనుభవాలను తరచూ పిల్లలతో పంచుకోవాలి.
– డాక్టర్ బొర్రా మాధవి
డేకేర్ సెంటర్లో వదలాల్సి వస్తోంది..
ఉద్యోగం చేయనిదే ఇల్లు గడవని పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాల్లో మరీ కష్టంగా ఉంటుంది. పెద్దవారు తోడుంటే సరేసరి. లేదంటే డేకేర్ సెంటర్లో ఉంచి ఉద్యోగాలకు వెళ్లాల్సి వస్తుంది. పిల్లలతో గడపడానికి సమయం ఉండటం లేదు. మా బాబు మాట్లాడటంలో కొంత వెనుకబడి పోయాడు. వైద్యులను సంప్రదిస్తే స్పీచ్ డిలేకు కారణాలు చెప్పారు. మనం వారికి సహకరించకపోతే ఆటిజం బారిన పడుతారు.
– ప్రశాంతి,ఐటీ ఉద్యోగి
సత్ప్రవర్తన వైపు అడుగులు వేయించాలి
పిల్లలందరి ఆలోచనలు ఒకేరకంగా ఉంటాయి. ఇంట్లో ఉండే పరిస్థితులకనుగుణంగా వారి ప్రవర్తన మారుతూ ఉంటుంది. సరైన ఆహా రం, లాలన, ప్రేమ వారికి అందిస్తుండాలి. ఉద్యోగాలు చేసే ఇండ్లల్లో పిల్లలు ఒంటరిగా గడపాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ప్రేమకు కరువై వారు మానసికంగా పరిపక్వత సాధించడంలో వెనకంజలో ఉంటారు. పిల్లలు ఒక్కో దశలో ఒక్కోటి నేర్చుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకుంటూ సహకరించడం వల్ల ఏది మంచి ఏది చెడు అనే భావనలు అర్థమవుతా యి. అదే వారిని సత్ప్రవర్తన వైపు అడుగులు వేయిస్తుం ది. ఈ ఐదేళ్లు పేరెంట్స్ పిల్లలకు సమయం ఇవ్వలేకపోతే వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేసినవారవుతారు.
– రామచందర్, సైకాలజిస్ట్