వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 03: ప్రభుత్వంతో పాటు ప్రతిఒక్కరి నిరంతర కృషి వల్లే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తున్నదని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 8వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ‘ఇన్నోవేటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియా టు బీఏ గ్లోబల్ లీడర్’ అనే అంశంపై మూర్తి ప్రసంగించారు. సమాజంలో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులకు ఇది ప్రధాన భూమిక అన్నారు. అందరికీ అన్నం పెట్టే వారిని గ్రీన్ వారియర్‌గా అభివర్ణించారు.
వ్యవసాయం సహా అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటివి కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. ఐఐటీ హైదరాబాద్ కాలానుగుణంగా అనేక కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నదన్నారు. పీజేటీఎస్ఏయూ, ఐఐటీ హైదరాబాద్ పూర్తి భాగస్వామ్యంతో పనిచేసి అనేక డిప్లొమా, సర్టిఫికెట్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించాల్సిన అవసరం ఉందని మూర్తి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం నేడు అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఏసీసీ వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి ఉప కులపతి డా.రఘునందన్ రావు అన్నారు.
ఒకప్పుడు అధిక వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు సాధించడమే లక్ష్యంగా ఉండేదని, కానీ నేడు పరిస్థితులు మారాయన్నారు. అధిక ఉత్పత్తి, ఉత్పాదకతలు సాధించడంతో పాటు రైతులకు లాభాలు చేకూర్చడం అన్నది కూడా నేడు చాలా ప్రధానమన్నారు. అంతకు ముందు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ, ఎస్.సుధీర్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. ఎనిమిదేండ్లుగా వర్సిటీ సాధించిన ఫలితాలు ప్రధానంగా ఎనిమిది కొత్త కళాశాలలు, రెండు కృషి విజ్ఞాన కేంద్రాలు, అగ్రి హబ్, టఫ్ శిక్షణ కేంద్రాలు, పలు చోట్ల ల్యాబ్‌ల ఏర్పాటు, ప్రతి ఏటా అగ్రి బీఎస్సీ సీట్ల పెంచుతున్నామన్నారు.
వివిధ పంటలకు చెందిన 54 రకాల వంగడాలను విడుదల చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు, అభ్యుదయ రైతులకు, బోధనా, బోధనేతర సిబ్బందికి పురస్కారాలు అందజేశారు. కొన్ని ప్రచురణలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతులు, పారిశ్రామిక ప్రతినిధులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ ఉప కులపతులు, రిజిస్ట్రార్లు, ఐసీఎఆర్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.