ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 9 : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపడంతోనే ఇబ్రహీంపట్నంకు సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి రూ.221కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మార్లు కేంద్రాన్ని కోరినా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ముచ్చర్ల సమీపంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ ముందుకొచ్చిందని, దీనికీ కేంద్రం పైసా ఇవ్వలేదన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వపరంగా సహకారాన్ని అందిస్తామన్నారు. రోడ్ల మరమ్మతులకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.15కోట్లు మంజూరు చేసిన మంత్రి ప్రకటించారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణకూ నిధులు మంజూరు చేస్తామన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్చెరువు సుందరీకరణకు రూ.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సత్తయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, క్యామ మల్లేశ్, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, నోముల కృష్ణగౌడ్, సత్తు వెంకటరమణారెడ్డి, బర్ల జగదీశ్‌యాదవ్, డబ్బికార్ శ్రీనివాస్, జేపీ శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీలు భూపతిగల్ల మహిపాల్, జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, చెవుల స్వప్న, మల్రెడ్డి అనురాధ, అదనపు కలెక్టర్ ప్రతిక్‌జైన్, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జాపాల-రంగాపూర్ అబ్జర్వేటరీని టెక్నికల్ హబ్‌గా మారుస్తాం..
జాపాల – రంగాపూర్ అబ్జర్వేటరికి 200 ఎకరాల భూమి ఉన్నదని, ఇందులో సాంకేతికపరమైన కళాశాలలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఖగోళ శాస్త్ర పరిశోధన శాలతో పాటు ఇతర సాంకేతిక పరమైన కళాశాలలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
– విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
సాగర్హ్రదారి విస్తరణకు నిధులు కేటాయించాలి..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సుమారు 70 కిలోమీటర్ల సాగర్ రహదారి విస్తరించి ఉందని, ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా బీఎన్‌రెడ్డినగర్ నుంచి మాల్ వరకు రహదారి విస్తరణకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో పార్కుల స్థలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ముందుగా 6 పార్కులకు రూ.3కోట్లను కేటాయించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.
– టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి