సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డిలు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు డస్ట్ బిన్లను పంపిణీ చేశారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రాంకీ సంస్థ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద మొత్తం 5,300 డస్ట్ బిన్లను జీహెచ్ఎంసీకి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఒకో శానిటేషన్ బృందానికి రెండు డస్ట్ బిన్ల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఊడ్చిన చెత్తను వెనువెంటనే ఈ బిన్లో వేసి నిండిన తర్వాత మూసివేయబడిన వాహనాల ద్వారా డంప్ యార్డ్‌కు తరలిస్తారని వివరించారు.
సులువుగా చెత్త తరలింపు
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 18,550 పారిశుధ్య కార్మికులు 2,650 గ్రూపులుగా ఏర్పడి ప్రతి రోజు రోడ్లపై చెత్తను సేకరించి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. సేకరించిన చెత్తను నల్ల కవర్లలో పెట్టి మినీ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. 338 ఓపెన్ టిప్పర్ల ద్వారా ఎదురవుతున్న సమస్యలను, అపరిశుభ్రతను, అధిగమించేందుకు రాంకీ సంస్థ కొత్తగా మూసివేయబడిన సెకండరీ కలెక్షన్ కంటైనర్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ బిన్స్, సెకండరీ కలెక్షన్ కంటైనర్ వాహనాలు ఎటువంటి సమస్యలు లేకుండా సులువుగా చెత్తను తరలించవచ్చుని మేయర్ తెలిపారు.
స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుపడకపోతే చర్యలు
స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ ఆటోల పనితీరును సంబంధిత అధికారులతో స్వచ్ఛ ఆటోల లబ్ధిదారులతో మేయర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ గ్యారెంటీతో బ్యాంకు లోన్లు ఇప్పించడం జరిగినదని, కొందరు లక్ష్యాన్ని పకకు పెట్టి ఇష్టమైన రీతిలో వ్యవహరిస్తున్నారని, వారి పనితీరును మార్చుకోని పక్షంలో అట్టి ఆటోలు ఇతర నిరుద్యోగ యువకులకు కేటాయిస్తామని మేయర్ హెచ్చరించారు. ఒకొక స్వచ్ఛ ఆటో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టాలని, నిర్దేశించిన సేకరణ పూర్తిగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని మేయర్ చెప్పారు. ప్రతి రోజు ఉదయం 6:00 నుంచి 11 గంటల వరకు తప్పనిసరిగా కేటాయించిన కాలనీలో ఉండి వందకు 100% వ్యర్థాల సేకరణ పూర్తి చేసిన తర్వాతనే కాలనీ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. కేటాయించిన వార్డులో కాకుండా ఇతర వార్డులలో కొందరు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపడుతున్నట్టు ఫిర్యాదులు చేస్తున్నారని, ఇక నుంచి అలాంటివి పునరావృతం కావొద్దని అన్నారు.