నవరాత్రులు ముగిసేంతవరకు బొజ్జ గణపయ్యకు నిత్య నైవేద్యం
సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి వస్తుందనగానే ఆబాలగోపాలానికి ఎక్కడలేని ఉత్సాహం మొదలవుతుంది. చవితికి ముందే విరాళాలు, మండపాల ఏర్పాటు, అలంకరణ, నిత్య పూజలకు ఏర్పాట్లు, కాలనీ వాసులను ఆహ్వానించి వివిధ పోటీలు నిర్వహించడం..ఇలా వీధి వీధినా చిన్నా పెద్దా ఎవరి స్థాయిలో వారు విభిన్న రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. అయితే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు కొంతకాలంగా అమలవుతూ వస్తున్న కమ్యూనిటీ యాక్టివిటీ మరింత శోభను చేకూరుస్తున్నది. నగరంలో అక్కడక్కడా కొన్ని పెద్ద అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వినాయక నవరాత్రులను మరింత భిన్నంగా నిర్వహిస్తున్నాయి. అపార్టుమెంటులోనే వినాయకుడిని ప్రతిష్టించి నిత్యం పూజలు నిర్వహించి గణపయ్యకు నైవేద్యం సమర్పించి అపార్టుమెంటువాసులందరూ మండపం వద్దే పంక్తి భోజనాలు చేస్తున్నారు. దీంతో నిమజ్జనం వరకు కమ్యూనిటీ అంతా పండుగను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించుకుంటున్నారు.
పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో వందల సంఖ్యలో ఉండే ఫ్లాట్లలో వేల సంఖ్యలో విభిన్న రుచులతో భోజనాలు చేయించాల్సి ఉంటుంది. అందుకే ఈ వేడుక నిర్వహణకు ప్రత్యేక మైన కమిటీ వేసుకొని అవసరమైన మేరకు చందాలు సేకరిస్తారు. ఉదయం పూజ, ప్రసాదం నుంచి రాత్రి భోజనం వరకు సజావుగా సమయానికి వంటలన్నీ పూర్తయ్యేలా ప్రణాళిక అమలు చేస్తారు. అపార్టుమెంటు వాసులందరూ ఒకే చోట కలవడం పెద్ద పెద్ద నగరాల్లో చాలా అరుదైన విషయం. అయితే 11 రోజుల పాటు వినాయక పంక్తి భోజనాలతో అందరూ పదకొండు రోజుల పాటు కలిసి భోజనం చేసే అవకాశం ఉండడంతో ఈ ట్రెండ్‌ను ఆహ్వానిస్తున్నారు. శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, తార్నాక, హిమాయత్‌నగర్, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో కొంతమంది గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఇప్పటికే తమ పదకొండు రోజుల పంక్తి భోజనాలకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేశారు.
జీహెచ్ఎంసీ.. 4 లక్షల మట్టి ప్రతిమలు
సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒకరూ బాధ్యతగా మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 4 లక్షల మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా నిమజ్జనానికి 74 కొలనులను ఏర్పాటు చేశామని, 280 క్రేన్లను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా గణేశ్ విగ్రహాల పంపిణీకి విశేష స్పందన వచ్చిందని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, ఎస్ఈ కోటేశ్వరరావు, సీఎంహెచ్వో డా.పద్మజ, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ అధికారి భరత్, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ వీఎస్ వెంకటేషన్, ఆపరేషన్ ఇన్చార్జి సుధాకర్, రాంకీ ఫౌండేషన్ ఎం.వి.రాంరెడ్డి, కోటేశ్వర్, ఎండి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ.. లక్ష విగ్రహాల పంపిణీ
పర్యావరణ పరిరక్షణకు ప్రజలు మట్టి వినాయకులనే పూజించాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ అన్నారు. సోమవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌లో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోనే ఒక లక్ష విగ్రహాలను 8 అంగుళాల సైజులో తయారు చేయించి, నగరంలోని 41 కేంద్రాల ద్వారా మూడు రోజులుగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. హుస్సేన్‌సాగర్ పక్కన బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ఓఆర్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్, బీపీపీ ఓఎస్డీ సంతోష్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
హెచ్ఎండీఏ కార్యాలయంలో..
అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ అధికారి గంగాధర్, ఎస్.ఈ పరంజ్యోతి,ఈఈ అప్పారావు,సీఏవో విజయలక్ష్మి స్థానికులకు మట్టి గణపతులను అందజేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలోనూ ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విగ్రహాలను పంపిణీ చేశారు.
నేడు వినాయక చిత్రలేఖన పోటీలు
జాతీయ సమైక్యత, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా వినాయక ప్రతిమలపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు జవహర్ బాలభవన్ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు 30వ తేదీ మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలలో పాల్గొనవచ్చని, పోటీల సమయంలో కేవలం తెల్లటి డ్రాయింగ్ చాట్ మాత్రమే అందిస్తామని, మిగతా చిత్రలేఖన వస్తువులు అభ్యర్థులే తెచ్చుకోవాలని ఆమె సూచించారు. విజేతలకు బహుమతులను అందజేస్తామని, వివరాలకు 040-23233952 నంబర్లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు.