హయత్‌నగర్, ఆగస్టు 29: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో పార్కు చేసిన కారులో పూజారి మృతి మిస్టరీగా మారింది. మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. హయత్‌నగర్‌లో పలు ఆలయాల్లో పూజారిగా పనిచేసిన గుండోజు షణ్ముఖ శర్మ(39) మృతి పెద్ద చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి పూజారి షణ్ముఖ శర్మ ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పటికీ ఆదివారం సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రాగా తెలిసిన ప్రాంతాల్లో ఆయన ఆచూకీ వెతికారు. హయత్‌నగర్‌లోని విద్యానగర్ కాలనీలో తన కారులో శర్మ మృతిచెంది కనిపించాడు. వెంటనే అతడిని స్థానిక కృష్ణవేణి ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హయత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు నర్సింహ, సూర్య, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్కాడ్, క్లూస్‌టీమ్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లాయి. జగన్, షణ్ముఖల శర్మ మధ్య ఆర్థిక వ్యవహారాల్లో మనస్పర్థాలు ఏమైనా వచ్చాయా.?, పూజారి శర్మ వివాహేతర సంబంధాలు ఏమైనా పెట్టుకున్నాడా.? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
కారులోనే..
కారు డోర్లు వేసుకొని పడుకోవడం వల్లే మృతిచెందినట్లుగా తెలుస్తోంది. కారు అద్దాలు వేసుకోవడం వల్ల గాలి ఆడక మృతదేహంపై కాలిన గాయాలు మాదిరిగా చర్మం విడిపోయి ఉంది. దర్యాప్తును అన్ని కోణాల్లో కొనసాగిస్తున్నాం. అందులో ఏమైనా ఇతర విషయాలు తెలుస్తాయోమో వేచి చూద్దాం.
– హెచ్.వెంకటేశ్వర్లు, సీఐ హయత్‌నగర్