సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/ఎల్బీన గర్/మియాపూర్/కేపీహెచ్‌బీ కాలనీ/ చార్మినార్: ఏదైనా ఓ ప్రాజెక్టు లేదా నిర్మాణం ప్రారంభిస్తే అది పూర్తవడానికి ఒకప్పుడు ఏండ్లకు ఏండ్లు పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ఆలస్యాలకు స్వస్తి పలుకుతూ.. ఎదురయ్యే అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ మౌలిక సదుపాయాల ప్రణాళికలను త్వరితగతిన పూర్తి చేస్తున్నది. అందుకు నిదర్శనమే నగరంలో చేపడుతున్న ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) నిర్మాణాలు.ట్రాఫిక్ చిక్కుల నుంచి నగరవాసులకు విముక్తి కలిగించేలా ప్రధాన రహదారుల్లో 47 చోట్ల పై వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మిస్తూ వస్తున్నది. వీటిలో ఇప్పటికే 31 చోట్ల ఆ పనులు పూర్తయ్యాయి. దీంతో అనేక మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరో 16 చోట్ల నిర్మాణాలు ఈ ఏడాది ఆఖరుకల్లా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఎస్సార్డీపీ మొదటి దశ సంపూర్ణంగా పూర్తి కానున్నది. ఈ నేపథ్యంలోనే పాతనగరంలో మరో పై వంతెన ప్రారంభమైంది. చాంద్రాయణగుట్టలో 45.87 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్‌ను స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మంత్రి మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు.
15 ఫ్లైఓవర్లు,7 ఆర్వోబీలు అందుబాటులోకి
ఉమ్మడి పాలనతో సాధారణంగా ఒక్కో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆరేడు ఏండ్లకు పైగా సమయం పట్టేది. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం గట్టి సంకల్పంతో చేపట్టిన ఎస్పార్‌డీపీ పనులు మొక్కవోని దీక్షతో సాగాయి. ఎస్సార్డీపీ మొదటి దశలో భాగంగా 8092 కోట్ల రూపాయలతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చేపట్టిన నిర్మాణాలతో ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు అటు నుంచి ఆరాంఘర్ వరకు ప్రయాణించే మార్గంలో నిర్మితమైన వరుస ఫ్లైఓవర్లు నగరవాసులకు ఎంతో ఉపశమనం కల్పించాయి.
టోలిచౌకి నుంచి రాయదుర్గం వెళ్లే మార్గంలో షేక్‌పేట వద్ద నిర్మించిన పై వంతెన కేవలం ఐటీ కారిడార్‌కు త్వరగా ఆ పరిసర ప్రాంతాల ముఖచిత్రాన్నే మార్చివేసింది. అబ్దుల్ కలాం ఫ్లైఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్, బహుదూర్ పుర ఫ్లై ఓవర్ లు పాతనగర వాసులకు ప్రయాణ భారాన్ని బాగా తగ్గించగలిగాయి. ఇప్పటి వరకు రూ.3748.85కోట్లతో నిర్మితమైన 31 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 15 ఫ్లై ఓవర్లు, 5 అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జి వంటి నిర్మాణాలతో అనేక చోట్ల దాదాపుగా ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. మరో 16 చోట్ల 4304.07 కోట్ల వ్యయంతో సాగుతున్న పనులు పురోగతిలో ఉన్నాయి. అవి ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
8092 కోట్లతో 47 చోట్ల పనులు
విజయవంతంగా వినియోగంలోకి.. 15 పై వంతెనలు, 7 అండర్‌పాస్‌లు ట్రాఫిక్ చిక్కుముళ్ల నుంచి నగరవాసులను తప్పించే ప్రయత్నంలో భాగంగా చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్-ఎస్సార్డీపీ) వేగంగా ముందుకు సాగుతున్నది. నగరవ్యాప్తంగా 47 చోట్ల చేపట్టిన పనుల్లో ఇప్పటికే 31 చోట్ల పూర్తయ్యాయి. మరో 16 ఈ ఏడాది ఆఖరు నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్మాణాలతో అనేక ప్రధాన రహదారుల్లో ప్రయాణ వ్యవధి బాగా తగ్గి ప్రయాణికులకు చెప్పలేని ఊరట కల్పించింది.
ఎల్బీనగర్లో 8 ఫ్లైఓవర్లు పూర్తి.. మరో 5 పురోగతిలో..
ఒకప్పుడు అత్యంత రద్దీగా ట్రాఫిక్‌తో సతమతమవుతూ ఉండే ఎల్బీనగర్ చౌరస్తా… ఎస్పార్‌డీపీ పనులతో ఆ ఇబ్బందుల నుంచి బయటపడుతున్నది. ఎస్సార్డీపీ ప్రణాళికలో భాగంగా కేవలం ఎల్బీనగర్ నియోజకవర్గంలో 448 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 13 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఇప్పటికే 8 పనులు పూర్తయ్యాయి. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు చౌరస్తాలో ఎడమ వైపు ఫ్లై ఓవర్, కామినేని నుండి ఎల్బీనగర్ వైపు కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు, చింతలకుంట, ఎల్బీనగర్ ఇరువైపులా అండర్‌పాస్‌లు, బైరామల్‌గూడ ఎడమ, కుడివైపు ఫ్లై ఓవర్ నిర్మాణాలు పూర్తి కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సిగ్నల్ ఫ్రీగా మారాయి. ప్రస్తుతం ఎల్బీనగర్ కుడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటుండగా, నాగోలు చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ పనులు యుద్ద ప్రాతిపదికన సాగుతున్నాయి. బైరామల్‌గూడ జంక్షన్లో రెండవ లేవల్ ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటుగా అదే చౌరస్తాలో ఎడమవైపు లూప్ ఫ్లై ఓవర్, కుడివైపు లూప్ ఫైల ఓవర్లు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఇవి కూడా పూర్తయితే ఇన్నర్ రింగ్‌రోడ్డు ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, విజయవాడ జాతీయ రహదారిపై, నాగార్జున సాగర్ రహదారుల్లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి మార్గం మరింత సుగమం కానుంది.
కూకట్‌పల్లిలో 4 ఫ్లైఓవర్లు
నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే కూకట్పల్లి వాసులకు ఎస్సార్డీపీ ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున ఊరట లభించింది. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా, జేఎన్టీయూహెచ్ నుంచి హైటెక్ సిటీ మార్గంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్, హైటెక్ సిటీ రైల్వే లైన్లను దాటాలంటే నిత్యం నరకం కనిపించేంది. గంటల తరబడి రోడ్లపై ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కానీ ఈ ఎనిమిదేండ్ల కాలంలోనే కూకట్పల్లి నియోజకవర్గంలో నాలుగు చోట్ల సుమారు రూ.630 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి రావడంతో ఆ ట్రాఫిక్ కష్టాలన్నీ తీరిపోయాయి. కేపీహెచ్‌బీ కాలనీ హైటెక్ సిటీ మార్గంలో రాజీవ్‌గాంధీ (ఫోరం సుజనా మాల్) చౌరస్తాలో రూ.97.93 కోట్ల నిధులతో 1.23 కి.మీ దూరం, 20 మీ. వెడల్పుతో ఆరు లైన్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ దగ్గర రైల్వే లైన్ కిందినుంచి రూ.59.09 కోట్లతో 410 మీ. దూరం 21.5 మీ. వెడల్పుతో ఆరు లైన్ల అండర్‌పాస్ బ్రిడ్జిని నిర్మించారు. కైత్లాపూర్ -మాదాపూర్ మార్గంలో రైల్వే లైన్ పైనుంచి రూ.86 కోట్లతో 675 మీ. దూరం, 16.61 మీ. వెడల్పుతో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. సికింద్రాబాద్ కూకట్పల్లి, సనత్‌నగర్ కుత్బుల్లాపూర్ లకు వెళ్లే ప్రధానమైన జంక్షన్ బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో రూ.387 కోట్లతో 1.13 కి.మీ దూరం, 24 మీ. వెడల్పుతో ఆరు లైన్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ బ్రిడ్జిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా జంక్షన్లో ఏండ్లనాటి ట్రాఫిక్ కష్టాలు మాయమయ్యాయి.
శేరిలింగంపల్లిలో 6 ఫ్లైఓవర్లు
ఐటీకారిడార్‌కు ప్రధాన స్థావరమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దారులన్నీ ఉదయం ఆఫీసు వేళల్లో వాహనాలు నెమ్మదిగా కదిలేవి. సమయానికి ఆఫీసులకు చేరుకోవడం కష్టతరమైన పనిగా ఉండేది. ఈ ఇబ్బందులను సత్వరం దూరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఎస్సార్డీపీలో భాగంగా ఈ నియోజకవర్గంలో 1860 కోట్ల రూపాయలతో 6 ఫ్లైఓవర్లు 2 అండర్‌పాస్‌లు నిర్మించతలపెట్టింది. ఇందులో భాగంగా బయోడైవర్సిటీ వద్ద 2 పై వంతెనలు, రాయదుర్గం-షేక్‌పేట ఫ్లైఓవర్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్, మైండ్‌స్పేస్ అండర్‌పాస్, అయ్యప్పసొసైటీ అండర్‌పాస్ ఇప్పటికే పూర్తయ్యాయి. గచ్చిబౌలి వద్ద శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్, కొత్తగూడ-కొండాపూర్ ఫ్లైఓవర్లు ఈ ఏడాది ఆఖరుకల్లా నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రానున్నాయి.
ఎస్ఆర్డీపీ మొదటి దశ వివరాలు