సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి… ఎందుకు.. గడిచిన దశాబ్ద కాలం నుంచి పచ్చదనం కనుమరుగై చివరకు ప్రాణ వాయువు కూడా దొరకని దుస్థితి వల్లే.. మరి… అదే మన హైదరాబాద్‌లోనైతే పచ్చదనం అంతకంతకూ పెరిగింది. ఒకటీ.. అరా కాదు! గత దశాబ్ద కాలంలో ఏకంగా 147 శాతం మేర పచ్చదనం పెరగడమంటే సాధారణ విషయం కాదు. ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ ముందుచూపుతో పురుడుపోసిన హరితహారంతోనే సాధ్యమైందనేది కండ్ల ముందు కనిపిస్తున్న సజీవ సాక్ష్యం. అనేక నివేదికల్లోనూ ఇదే వెల్లడైంది. ప్రపంచంలోనే ట్రీ సిటీగా అంతర్జాతీయ గుర్తింపును సాధించిన హైదరాబాద్ దేశంలోని ఇతర మెట్రోలు అందుకోనంత పరిమాణంలో హరితం విస్తరించిందని తేల్చారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ట్వీట్ చేస్తూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆయన మానస పుత్రిక హరితహారం పథకంతోనే ఇది సాధ్యమైందని, విజయవంతంగా అమలు చేసిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ యంత్రాంగాన్ని అభినందించారు.
హైదరాబాద్ మహానగర నివాసితులకు మెరుగైన చకటి వాతావరణం కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. కాంక్రీట్ జంగిల్లా మారుతున్న హైదరాబాద్ మహానగర దిశను మార్చి… భావితరాలకు పచ్చని నగరాన్ని అందించేందుకు హరితహారం అనే అస్ర్తాన్ని సంధించింది. దాని ఫలితంగానే గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో కోట్లాది మొక్కలను నాటడంతో నగరం పచ్చని వనంలా మారింది. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా వాటిని వదలకుండా యాదాద్రి మోడల్ మియవాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్, అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ ట్రీ పార్లు ఇలా అన్ని మార్గాల్లోనూ పచ్చదనం, సుందరీకరణ పనులను చేపట్టారు.
దీంతో గత పదేండ్ల కాలంలో అంటే ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన హరితహారంతో హైదరాబాద్ మహా నగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు తాజాగా తేల్చారు. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం ఉండగా… హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత అటవీ విస్తీర్ణం 81.81 చదరపు కిలో మీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా) ప్రకటించింది. అంతేకాదు… ఎఫ్‌ఎస్‌ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏవో (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికి హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా గుర్తించాయి. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీలో పాల్గొనగా, హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ ఘనత సాధించడం విశేషం.