గోల్నాక, ఆగస్టు 27: అంబర్‌పేట నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా మంజూరైన రూ.12 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా మంజూరైన నిధులను భవిష్యత్ ట్రాఫిక్‌కు అనుగుణంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన చౌరస్తాల్లో ఆధునీకరణ, ప్రస్తుత పార్కులను థీమ్ పార్కులుగా అభివృద్ధి, శ్మశాన వాటికల అభివృద్ధి కోసం వినియోగిస్తామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రహదారులు పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అంతే కాకుండా పనుల చేపడుతున్న సమయంలో ప్రజలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ రంజిత్‌కుమార్, ఏసీపీ సాయిబాబా, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఎలక్ట్రిక్ డీఈ చంద్రశేఖర్, అధికారులు బాబుమియా, మహేశ్ పాల్గొన్నారు