అమీర్‌పేట్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ సర్కార్ హయాం లో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఖరీదైన వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తుండటంతో ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఎస్ఆర్నగర్లోని సీల్వెల్ కార్పొరేషన్ అధినేత సీహెచ్. సుబ్బారావు రూ.5.50 లక్షల వ్యయంతో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, పిల్లల వార్డుల్లో అవసరాలకై ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లతోపాటు ఆసుపత్రి ఫర్నిచర్‌ను తన వంతు చేయూతగా సమకూర్చారు.
బుధవారం అమీర్‌పేట్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి సీహెచ్.సుబ్బారావుతో కలిసి సామగ్రిని ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, పిల్లల వార్డులకు ఏసీలు, గీజర్లు, అత్యవసర మందులు నిల్వ చేసేందుకు వీలుగా రిఫ్రిజిరేటర్లను అందించేందుకు ముందుకు వచ్చిన సీల్వెల్ కార్పొరేషన్ అధినేత సీహెచ్.సుబ్బారావును మంత్రి ఘనంగా సన్మానించారు.
పెరుగుతున్న వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమీర్‌పేట్‌లో 50 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగిందని, ఇక్కడి ఆవరణలోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుని అదనంగా మరిన్ని పడకలను పెంచేలా అదనపు నిర్మాణాలు జరిగేలా చూస్తానన్నారు. వైద్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయాయన్నారు. కరోనా సమయంలో రోగులకు గాంధీ ఆసుపత్రి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని గుర్తు చేశారు.
అమీర్‌పేట్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అయితే ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు మరిన్ని వసతుల కల్పన జరగాల్సి ఉందని, ఆ విషయమై ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ సునీత, ఆర్ఎంవో డాక్టర్ వినాయక్రావులతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
బేగంపేట్, ఆగస్టు 24: బేగంపేట్ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు కూన వెంకటేశంగౌడ్ కుటుంబసభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బుధవారం పరామర్శించారు. వెంకటేశంగౌడ్ సోదరుడు అంజిబాబుగౌడ్ ఇటీవల మరణించగా, బుధవారం గాజులరామారంలోని నివాసంలో నిర్వహించి దశదిన కర్మకు మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజిబాబు చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.