రంగారెడ్డి, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ): జిల్లా నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ డి.అమయ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొంగరకలాన్‌లోని సర్వే నంబర్ 300లోని 40 ఎకరాల్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. తదనంతరం నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధంగా ఉండగా.. తుది మెరుగులు దిద్దుతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. హెలీప్యాడ్‌ను కూడా నూతన కలెక్టరేట్‌కు సమీపంలో ఏర్పాటు చేశారు.
50 వేల మందితో భారీ బహిరంగ సభ
జిల్లాలోని కొంగరకలాన్‌లో నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 50 వేల మందితో భారీ జనసమీకరణతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 20 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణకు సంబంధించి మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు మహేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు జిల్లా టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్కింగ్‌కు సంబంధించి కూడా 20 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎంకు ఘనంగా స్వాగతం పలుకుతాం
జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని, ప్రతి జిల్లా అధికారి తమ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. రహదారులు గుంతలు లేకుండా బాగు చేయాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలకు ఇన్చార్జిలుగా ఉన్న అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
– విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ప్రజాప్రతినిధులు
రేపు జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ డి.అమయ్‌కుమార్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ ప్రారంభానికి ఏర్పాట్లు, బహిరంగ సభకు జనసమీకరణకు సంబంధించి సమావేశంలో చర్చించారు. తదనంతరం బహిరంగ సభ స్థలిని పరిశీలించి, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎమ్మెల్సీలు పి.మహేందర్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, జైపాల్‌యాదవ్, ప్రకాశ్‌గౌడ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.