సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికే మణిహారం ఔటర్ రింగ్‌రోడ్డు. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారిపై నిత్యం ఎందరో వాహనదారులు తమ గమ్యస్థానాలకు శరవేగంగా చేరుతుంటారు. ఈ ప్రయాణంలో అనుకోని అవాంతరాలు కొన్నిసార్లు ఎదురవుతుంటాయి. అతివేగమో, నిర్లక్ష్యమో..కారణం ఏదైనా కానీ ఓ రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తోంది. ఇలాంటి ఆపద సమయంలో పట్టపగలు అయినా, అర్ధరాత్రి అయినా క్షతగాత్రులకు సంజీవని కేంద్రంగా ట్రామా కేర్ సెంటర్లు ఆదుకుంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్అవర్లో చికిత్స అందించేందుకు హెచ్ఎండీఏ ఆధీనంలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) అవుటర్ రింగు రోడ్డుపై అత్యాధునిక సౌకర్యాలతో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ఏర్పాటు తర్వాత ఔటర్ ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ట్రామా కేర్ సెంటర్లపై వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా ప్రచారం జరగాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
ఔటర్‌పై ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటన జరిగినపుడు సంప్రదించాల్సిన అత్యవసర నెంబర్లను హెచ్ఎండీఏ విభాగం ఆదివారం ట్వీట్ చేయగా… దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఔటర్ రింగు రోడ్డుపై సుమారు రెండు సంవత్సరాల కిందటే ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటైయ్యాయి. ఇంటర్ఛేంజ్ల్లో తొలుత పది సెంటర్లు ఏర్పాటు చేయగా.. అనంతరం మరో ఆరింటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ 16 సెంటర్లతో పాటు పది అత్యాధునిక లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లను కూడా ఔటర్‌పై అందుబాటులో ఉంచారు. గతంలో ఔటర్‌పై ప్రమాదాలు జరిగినపుడు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించేవారు. కానీ ఈ ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాల్లో అత్యాధునిక లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లు వచ్చి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నాయి. తర్వాత పరిస్థితిని బట్టి తొలుత ట్రామా కేర్ సెంటర్లకు, ఆపై ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తద్వారా కీలకమైన గోల్డెన్ అవర్లోనే క్షతగాత్రులకు వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో వేలాది మందికి పునర్జన్మ లభిస్తున్నది.
ట్రామా కేర్ సెంటర్లు ఉన్న ఇంటర్‌చేంజ్‌లు…
పెద్ద అంబర్‌పేట, బొంగుళూరు, తుక్కుగూడ, శంషాబాద్, టీఎస్పీఎ(తెలంగాణ పోలీస్ అకాడమీ), తారామతి పేట, శామీర్‌పేట, రావిర్యాల, పెద్ద గోల్కొండ, కోకాపేట, పటాన్చెరువు, దుండిగల్, ఘట్కేసర్, కొల్లూరు, సుల్తాన్పూర్, మేడ్చల్
ట్రామా కేర్ సెంటర్లలో వైద్య సేవలు అందుకున్న క్షతగాత్రుల వివరాలు
మొత్తం క్షతగాత్రులు – 1767
ప్రథమ చికిత్స అందుకున్న వారు – 597
ప్రథమ చికిత్స తర్వాత ఆస్పత్రికి తరలించినవారు – 424
ట్రామా సెంటర్ నుంచి డిశ్చార్జి అయిన వారు – 415
ట్రామా కేర్ సెంటర్ నుంచి ఆస్పత్రికి తరలించినవారు – 331
ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలు/అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నెంబర్లు – 1066/1059102
క్షణాల్లో అంబులెన్స్‌లు…
ఔటర్‌పై ఆధునాతన సౌకర్యాలతో కూడిన 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లను ప్రతి పది కిలోమీటర్ల దూరంగా సిద్ధంగా ఉండి సేవలు అందిస్తున్నారు. 108తో సమన్వయం చేసుకుంటూ అత్యాధునిక అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన బెసిక్ లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లు ఘటన జరిగిన ప్రాంతానికి ఐదు నిమిషాల్లో చేరుకుని ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.