శేరిలింగంపల్లి, ఆగస్టు 21: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాపంగా ఒక్క రోజే 75 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి చెప్పారు. అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో బొటానికల్ గార్డెన్లో న్యాయ వివాదంలో ఉన్నదని, సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించుకుని ఇప్పుడు దేశంలోనే అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు. అనంతరం బొటానికల్ గార్డెన్ వాకర్స్ కోసం గార్డెన్ ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి, అటవీ ముఖ్య సంరక్షణ అధికారి ఆర్ఎం డోబ్రియల్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.