సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): మిలటరీ క్యాంప్‌లో మెడికల్ క్యాంప్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుందంటూ ఓ వైద్యుడికి ఫోన్ చేసిన సైబర్‌నేరగాళ్లు, అతడి వద్ద నుంచి రూ.6 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి తాను మిలటరీలో పనిచేస్తున్నానంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మా వద్ద 300 మంది మిలటరీకి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే దానికి అయ్యే ఖర్చు మేం భరిస్తామని, మీరు డెబిట్ కార్డు నంబర్ చెబితే మీకు అడ్వాన్స్ డబ్బులు చెల్లిస్తానంటూ నమ్మించాడు. దీంతో ఆయన ఆ వివరాలు అవతలి వ్యక్తికి చెప్పడంతో దఫ దఫాలుగా ఆయన ఖాతాలో నుంచి రూ.6 లక్షలు సైబర్ చీటర్స్ ఖాళీ చేశారు.
మిలటరీలో యోగా శిక్షణ ఇవ్వాలి. నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నాం. అందుకు మా క్యాంప్‌లో 500 మంది మిలటరీ సిబ్బంది ఉంటారు. వాళ్లకు ఉదయం ఒక గంట పాటు యోగ, ధ్యానంలో శిక్షణ ఇవ్వాలి. ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామంటూ నమ్మించారు. ఆ యోగా టీచర్ నెలలో రూ.5 లక్షలు వస్తాయని ఆశతో ఒప్పేసుకున్నాడు. మీ గూగుల్ పే నంబర్ చెప్పండి అంటూ నంబర్ తీసుకున్నారు. మీరు ఒక రూపాయి పంపించండి.. మీ నంబర్ నిర్ధారించుకుంటామంటూ సూచించారు. ఆ తరువాత రెండు రూపాయలు పంపించారు. మీరు మరో సారి రూ.వెయ్యి పంపిస్తే.. డబుల్ వస్తాయంటూ నమ్మించాడు. అలాగే చేయడంతో క్యూఆర్ కోడ్ పంపించారు. అందులో రిసీవ్కు బదులుగా, పే అంటూ ఉంది. దీంతో బాధితులు వెయ్యి పంపించడంతో వెంటనే రూ.2 వేలు రిటర్న్ వచ్చినట్లు కోడ్ వచ్చింది. బాధితుడు చూసుకోకుండా యాక్సెప్ట్ చేశాడు. వెంటనే ఖాతాలో నుంచి రూ.2 వేలు వెళ్లాయి. ఇలా తికమక పెడుతూ రూ.1.5 లక్షలు సైబర్నేరగాలు కొట్టేశారు.
అవకాశం చిక్కితే..
మిలటరీలో మెడికల్ క్యాంప్ పెట్టాలి… మిలటరీ వాళ్లకు యోగా శిక్షణ ఇవ్వాలి.. మా సంస్థలో ఉన్న ఉద్యోగులకు ఫిజికల్ ఫిట్నెట్లో శిక్షణ ఇవ్వాలి ఇలా శిక్షకులను, వివిధ సేవలు అందించే వారిని టార్గెట్ చేస్తూ సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఒకేసారి కాంట్రాక్టు వస్తుందనే ఉద్దేశంతో వెనుకా ముందు ఆలోచించకుండా ఈజీగా సైబర్‌నేరగాళ్లు వేసే వలలో బాధితులు చిక్కుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ట్రై కమిషనరేట్ల పరిధిలో తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. వివిధ వృత్తులలో ప్రొఫెషనల్‌గా ఉన్నవారినే సైబర్‌చీటర్స్ మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి
విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.