సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) ;‘జై కేసీఆర్.. జై తెలంగాణ..’ నినాదాలతో మహానగరం మార్మోగింది. ‘మునుగోడు ప్రజా దీవెన’ సభకు వాహనాల శ్రేణితో కలిసి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గ్రేటర్ గులాబీ దళం ఘనస్వాగతం పలికింది. సీఎం కాన్వాయ్ వెంట కదం కదిపి.. అదే జోష్‌తో మునుగోడు వరకు తరలివెళ్లింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో గులాబీ జెండాలతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సరికొత్త ఉత్సాహంతో కదిలారు.
ఫ్లోరైడ్ రక్కసి నుంచి తమ బతుకులను రక్షించిన అపర భగీరథుడిని చూసేందుకు అభిమానం వెల్లువెత్తింది. రైతు బంధుతో ఎవుసానికి సాయమై, రైతు బీమాతో వందల కుటుంబాలను నిలబెట్టిన రైతు బాంధవుడి మాట వినేందుకు కర్షకలోకం కదిలివచ్చింది. పెండ్లికి మేనమామ కట్నం అందుకున్న పేదింటి ఆడబిడ్డలు, పెద్దకొడుకును చూసేందుకు చేతి కర్ర ఊతంగా వృద్ధులు, కష్టాల కడలిని దాటిన నేతన్నలు, కడుపులో బిడ్డతో నిండు గర్భిణులు, మోదీ దెబ్బకు డీజిల్ ధరలతో బతుకు బండిని లాగలేక పోతున్న డ్రైవర్లు.. ఇలా సబ్బండ వర్గాల ప్రజలు పిల్లాపాపలతో మునుగోడుకు తరలివచ్చారు. వేల వాహనాలు.. ఎటుచూసినా గులాబీ రెపరెపలు.. ఊరూరా ఘన స్వాగతాలు.. ధూంధాం పాటలు.. బతుకమ్మ ఆటలు.. సంప్రదాయ నృత్యాలు, పచ్చికుండ బోనాలు.. కోలాటాల దరువుతో మునుగోడు ప్రజా దీవెన సభను పండుగ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ఉత్సాహంగా వింటూ చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. ఉప ఎన్నిక వేళ నిండు దీవెనలు అందించారు.
టీఆర్ఎస్ సర్కారుతోనే మునుగోడు మంచిగైందిటీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంకనే మునుగోడు మంచిగైంది. మా నియోజకవర్గాన్ని ఇంతకుముందు పట్టించుకున్న నాయకుడు లేరు. మోదీతోనే దేశం బాగుపడుతదనుకుంటే నాశనం అయితున్నది. డీజిల్ రేట్లు పెంచి మాలాంటి డ్రైవర్ల కడుపు కొడుతున్నడు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మునుగోడు మరింత అభివృద్ధి అయితది. బీజేపీని ఓడించి బుద్ధి చెప్తాం.
తరలివెళ్లారు ఇలా..
దమ్ముంటే..చర్చకు రావాలి
‘2014కు ముందు… రాష్ట్రం సిద్ధించిన తర్వాత… అంతకు ముందు గడిచిన 55 సంవత్సరాల్లో .. గత ప్రభుత్వాలు ఏం చేశాయో….తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకోవడానికి మేం సిద్ధం..దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాల’ని ప్రతిపక్షాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన మునుగోడు ర్యాలీ ప్రారంభ వేదిక నెక్లెస్‌రోడ్ పీవీ మార్గ్‌లోని పీపుల్స్పాజా వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ఎక్కడా జరుగడం లేదన్నారు. ఈ మధ్య కాలంలో ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ శాసన సభ్యుడు ప్రజలకు సేవ చేసే చేతగాక పారిపోయిన దశలో మునుగోడులో ఎన్నికలు అనివార్యమైందన్నారు. ఎన్ని శక్తులు అడ్డువచ్చినా గెలిచేది గులాబీ జెండానేనన్నారు. మునుగోడుకు ఏమైనా జరుగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే చేయాలని, ఎవరూ వచ్చి చేసే అవకాశమే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటే దుబ్బాక, హుజురాబాద్‌లో ఏం చేశారో చెప్పాలన్నారు. 24 గంటల కరెంటు, రైతాంగానికి సాగు నీరు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, ఆడకూతురు పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ఇచ్చిన చరిత్ర దేశంలో ఏ ప్రభుత్వానికి లేదన్నారు. దళిత, రైతు బంధు, భీమా లాంటి పథకాలు ఏ ప్రభుత్వం ఇస్తుందో చెప్పాలన్నారు.
నమ్మకం అంటే కేసీఆర్..గెలుపు అంటే టీఆర్ఎస్
నమ్మకం అంటే కేసీఆర్… గెలుపు అంటే టీఆర్ఎస్దేనని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ప్రజా దీవెన సభకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి భారీ వాహనాలతో మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్‌రాజు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమని, అక్కడ రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరుపేదలపై జీఎస్టీ వేస్తున్న బీజేపీని ప్రజలు చీదరించుకుంటున్నారని, కాంగ్రెస్‌ను దొంగల ముఠాగా భావిస్తున్నారని చెప్పారు. కాగా, మునుగోడులో సీఎం కేసీఆర్ సభకు మంత్రి మల్లారెడ్డి భారీ వాహన శ్రేణితో ర్యాలీగా బయలుదేరారు.
సీఎం కేసీఆర్ వెంటే యూత్
కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. అందరి బాగుగోల గురించి ఆలోచిస్తారు. మునుగోడు నియోజకవర్గంలోని యూత్ మొత్తం కేసీఆర్ వెంటే ఉంటుంది. టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుంది.
– బీసం విజయ్‌కుమార్, మునుగోడు
ఇది మన జీవితాల ఎన్నిక
ఇక్కడ ఏం అక్కర ఉందని వచ్చింది ఉప ఎన్నిక. ఇంకో ఏడాదైతే ఎలక్షనే ఉండే. ఇప్పుడు నడుమల ఎవర్ని ఉద్దరియ్యడానికి. ఎవల్ల సంక్షేమం కోరి! ఎవల్ల మంచికోరి!! దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటో గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. మునుగోడులో జరిగేది పార్టీల ఎన్నిక కాదు. మన జీవితాల ఎన్నిక. మన బతుకుదెరువు ఎన్నిక. మునుగోడు చైతన్యమైన గడ్డ. ఇక్కడి మెజారిటీ దేశానికి సందేశం కావాలె.
– సీఎం కేసీఆర్