సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ);స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహానగరంలో వన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో ఆదివారం కాలనీ, వార్డు, సర్కిల్ వారీగా పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ ఈ వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 4846 కాలనీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో కాలనీని యూనిట్‌గా తీసుకుని కాలనీలో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా ఫ్రూట్స్, ఫ్లవరింగ్ మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 45.28 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు. 48 అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో, 6చోట్ల మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్, 3 చోట్ల బ్లాక్ ప్లాంటేషన్ చేయనున్నారు. అలాగే ట్యాంక్‌బండ్, చార్మినార్ వద్ద నిర్వహించే సండే ఫన్‌లో ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు 75 పార్కుల్లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
–