సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జేఎన్టీయూ హైదరాబాద్ పలు విధానాలు అవలంభిస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు (అఫిలియేషన్లు) ఇచ్చే క్రమంలో ఏఐసీటీఈ, యూనివర్సిటీ ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలిస్తున్నారు. అన్నీ సక్రమంగా పాటించే సంస్థలకు మాత్రమే ఈ విద్యా సంవత్సరంలో అనుమతులు ఇవ్వాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ నెల 21 (ఆదివారం) నుంచి కౌన్సెలింగ్, 23 నుంచి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రారంభంకానున్నది. ఈ లోగా కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు అందుబాటులో ఉండే కాలేజీల వివరాలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడానికి జేఎన్టీయూ అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. అయితే విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరంలో అనుమతులు ఇవ్వకూడదని యూనివర్సిటీ అధికారులు తేల్చి చెబుతున్నారు.
కొనసాగుతున్న నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు
అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో అర్హులైన బోధనా సిబ్బంది ఉన్నారా ? పీహెచ్డీ పట్టాలు పొందిన వారు ఎంత మంది ఉన్నారు. డిపార్టుమెంట్ హెడ్‌కు పీహెచ్డీ ఉందా? ఈ పట్టాలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పొందారా? సిబ్బందికి కాలేజీ యాజమాన్యాలు జీతాలు సరిగా ఇస్తున్నారా? యూజీసీ స్కేళ్లు టీచింగ్ ఫ్యాకల్టీకి ఇస్తున్నారా? కంప్యూటర్ ల్యాబులు, సైన్స్ ల్యాబులు, రిఫరెన్స్ విభాగాలు, పరిశోధన, డెవలప్మెంట్ విభాగం, ప్లేస్మెంట్ సెల్, కోర్సులకు తగ్గినట్లుగా టీచింగ్ సిబ్బంది, ఆదాయ వ్యయాలు వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే అఫిలియేషన్లు ఇస్తున్నట్లు వర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో అఫిలియేషన్ల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయని, తుది దశకు చేరుకున్నదని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతుండటంతో ఇంజినీరింగ్ కాలేజీలు షాక్‌కు గురవుతున్నాయి.