తెలుగుయూనివర్సిటీ, ఫిబ్రవరి 8: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి 70వ జన్మదిన వేడుకలను మంగళవారం రెడ్‌హిల్స్ నఫీజ్ రెసిడెన్సీలోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో సాహితీవేత్తలు, కళాకారుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణాచారి దంపతులను అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం గజమాలతో సత్కరించారు. సాహిత్య, సాంస్కృతిక కళా సంస్థల ప్రతినిధులు లంక లక్ష్మీనారాయణ, నరసింహారావు, శంకర్, గుదిబండి వెంకటరెడ్డి, కిన్నెర రఘురాం, సంజయ్ కిశోర్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జె.చెన్నయ్య, నృత్య గురువు ఉషాగాయత్రి, త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, పలువురు జానపద కళాకారులు తదితరులు రమణాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జానపద కళాకారులకు, హరికథ కళాకారులకు నగదు సహాయం, దివ్యాంగులకు నిత్యావసర సరుకులను రమణాచారి పంపిణీ చేశారు. దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని రమణాచారి ఆకాంక్షించారు.
డాక్టర్ మంగళగిరి శ్రీనివాస్ గ్రంథావిష్కరణ..
తెలుగు అధ్యాపకులు డాక్టర్ మంగళగిరి శ్రీనివాస్ రచించిన వివేచన వ్యాస సంపుటిని రమణాచారి క్యాంపు కార్యాలయంలో పాలమూరు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య లక్ష్మీకాంత్ రాథోడ్ ఆవిష్కరించారు. మంగళగిరి శ్రీనివాస్ వ్యాస సంపుటిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారికి అంకితమిచ్చారు.