సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రక్తదాన శిబిరాలు విజయవంతమయ్యాయి. అర్బన్ కమ్యూనిటీ హాస్పిటల్ పరిధిలో రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర ఎన్జీవోల సహకారంతో సరిళ్ల వారీగా ఈ శిబిరాలను ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాసనసభ్యులు ప్రారంభించారు. సనత్ నగర్ నియోజకవర్గం వార్డు 100లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొండాపూర్ శ్రీరామ్‌నగర్ కాలనీలో ఎమ్మెల్యే గాంధీ రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో, ఎమ్మెల్యే భేతి రెడ్డి సుభాష్ రెడ్డి కాప్రా, ఉప్పల్ ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ఎమ్మెల్యే రాజా సింగ్ బేగంబజార్ యూపీహెచ్సీ, అంబర్‌పేట మున్సిపల్ కాలనీ ప్రభుత్వ హాస్సిటల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, రాజేంద్రనగర్ బుద్వేల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, అల్వాల్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మూసాపేటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు.
గాజులరామారంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పటాన్చెరులో గూడెం మహిపాల్‌రెడ్డి, యూ సుఫ్‌గూడలో మాగంటి గోపీనాథ్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌లో దానం నాగేందర్, సీతాఫల్మండిలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డితో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావు శిబిరాలను ప్రారంభించారు. మలక్‌పేటలో ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, సంతోష్‌నగర్‌లో ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, కార్వాన్లో కౌసర్ మొహినుద్దీన్, మెహదీపట్నంలో జాఫర్ హుస్సేన్, ముషీరాబాద్ సరిల్ కార్యాలయంలో ముఠా గోపాల్ పాల్గొన్నారు. మొత్తం 30 సరిళ్లలో నిర్వహించిన శిబిరాల్లో 1808 మంది రక్తదానం చేశారని, వారికి సర్టిఫికెట్లు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.
1251 యూనిట్ల సేకరణ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 16 ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి శిబిరంలో 75 చొప్పున 1250 యూనిట్ల రక్తం సేకరించి రక్తనిధికి అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొదట హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరవ్యాప్తంగా మొత్తం 1251 యూనిట్ల రక్తాన్ని సేకరించి, లక్ష్యాన్ని చేరుకున్నట్లు డాక్టర్ వెంకటి వెల్లడించారు.