బడంగ్‌పేట, ఆగస్టు 17: భారతదేశ స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీ పాత్ర మహోన్నతమైనదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ చందన చెరువు కట్టపై జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు ఘనంగా సంబురాల నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్రం రాక ముందు వచ్చిన తర్వాత 75 ఏండ్లలో దేశం ఎలా అభివృద్ధి జరిగిందో రానున్న కాలానికి దిశ నిర్ధేశానికి అవకాశం ఏర్పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాట పటిమ భావితరాలకు తెలిసే విధంగా గాంధీజీ సినిమాను 552 సినిమా హాళ్లలో రోజు రెండున్నర లక్షల మంది చూసే విధంగా ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. చందనం చెరువు కట్టమీద ఇప్పటికే తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి నింపటానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్, డీఈ గోపీనాథ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేదల పాలిట ఆపన్నహస్తం సీఎం సహాయనిధి
పేదల పాలిట ఆపన్నహస్తంగా సీఎం సహాయనిధి మారిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ నందిహిల్స్కి చెందిన జంగమ్మకు మంజూరైన రూ.25వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు ఇన్చార్జి రామిడి నర్సిరెడ్డి, కాలనీ వాసులు సురేశ్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
నూతన కలెక్టర్ కార్యాలయ పరిశీలన
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాధునికంగా కలెక్టర్ కార్యాలయాలు నిర్మించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొంగర రావిరాలలోని రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సౌలభ్యం కోసం నూతన కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
గతంలో అతి పెద్దదిగా ఉన్న రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగానే ఏర్పాటైన వికారాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించుకోగా నేడు మేడ్చల్ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. 44 ఎకరాల్లో కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్, అధికారులు, నాయకులు ఉన్నారు.