ఖైరతాబాద్, ఆగస్టు 6: వరద ముంపు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడానికి నాలాలు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలాల డీసిల్టింగ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ విస్తృతంగా చేపట్టింది. వ్యర్థాలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారులకు ఆనుకొని పలు నాలాలు ఉన్నాయి. నిత్యం రోడ్లపై నిల్వ ఉండే చెత్తాచెదారంతో పాటు స్థానికులు కొందరు అందులో వ్యర్థాలను వేస్తుండటంతో వర్షాకాలంలో సమస్యలు వస్తుండేవి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో లోతుగా ఉండడంతో పలు ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి. దీంతో నాలాల వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
600 మీటర్ల పొడవునా….
సర్కిల్ 17 పరిధిలో నాలాలన్నీ బాల్కాపూర్ పరిధిలోకి వస్తాయి. రాజ్‌నగర్, పార్కింగ్ యార్డు, నాసర్ స్కూల్ వద్ద, కారంపూడి బస్తీ, ఈ నాలా ప్రవహిస్తుంది. మొత్తం 1600 మీటర్లు ఉండగా, ప్రస్తుతం కారంపూడి బస్తీ నుంచి సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) వరకు 600 మీటర్లు పూర్తయ్యాయి. మిగతా ప్రాంతాల్లో ఇండ్లు, గోడలు ఉండడంతో వాటికి ఫెన్సింగ్‌లు ఏర్పాట చేయలేదు. వ్యర్థాలు వేసిన వారిపై చర్యలకు సైతం ఉపక్రమించింది. నాలాల పొడవునా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ‘డీప్ నాలా డ్రైన్… జాగ్రత్త, చెత్త వేస్తే శిక్షార్హులు’ అంటూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసింది.
వ్యర్థాలు వేయవద్దు
వర్షాకాలాల్లో ఎక్కువ సమస్యలు వచ్చేది నాలా పరీవాహక ప్రాంతాల్లోనే. ఫలితంగా కాలనీల్లో ఇండ్లలో వరద నీరు చేరుతున్నాయి. కొందరు వ్యర్థాలను నాలాలో వేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రజలకు ఇప్పటికే ఆటో క్యాంపెయిన్ ద్వారా అవగాహన కూడా కల్పించాం. నాలాల్లో వ్యర్థాలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. జీహెచ్ఎంసీ తరఫున ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిత్యం నాలాల శుద్ధ్దీకరణ చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. -చైతన్య, డీఈ, జీహెచ్ఎంసీ సర్కిల్ 17